09-03-2025 12:00:00 AM
రంగుల పండుగ హోలీ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండుగను ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఎన్నో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలున్న మనదేశంలో ఈ పండుగను ఒక్కోచోట ఒక్కోరకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రాంతాలవారీగా తేడాలుంటే ఉండొచ్చు. కాని, జరుపుకునే పద్ధతి మాత్రం దాదాపుగా ఒకటే ఉంటుంది. అయితే వసంతాగమనానికి సూచికగా జరుపుకునే ఈ పండుగరోజు చల్లుకునే ప్రతి రంగు వెనుకా అర్థం, పరమార్థం, ఎన్నో విశేషాలున్నాయి. అవేంటో చూద్దాం.
మార్చి 14: హోలీ
ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. చిగురించే మోదుగులు. పూసే గురువిందలు, పరిమళించే మల్లెలు, పుప్పొడి రేణువులు, గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి కాబట్టే ప్రతిఒక్కరూ హోలీని జరుపుకోవడానికి ఇష్టపడుతారు.
ఏ రంగు దేనికి ప్రతీక
పసుపు: పసుపు రంగు శాంతికి, ఆనందానికి, శ్రేయస్సుకు ప్రతీక. పసుపు రంగు లేకుండా హోలీ సెలబ్రేట్ చేసుకోవడంలో సంపూర్ణత ఉండదేమో అనిపిస్తుంది. శుభానికి సూచికగా పసుపు రంగు చల్లుకుంటారు.
ఎరుపు: ప్రేమ, అనుబంధం, సాన్నిహిత్యానికి సూచికగా భావించే ఎరుపు రంగును హోలీ సమయంలో వివాహిత మహిళలు నుదిటిన పెట్టుకుంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా తమ ప్రియమైన వారితో నుదిటిన పెట్టించుకుంటారు.
ఆకుపచ్చ: ఈ రంగు నూతన ప్రారంభాలకు, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. పచ్చని పంటలను, సంతోషాన్ని, సంతృప్తిని సూచిస్తుంది. ఈ రంగును దేవుళ్లకు కూడా సమర్పిస్తుంటారు.
నీలం: శ్రీకృష్ణుడి రూపానికి దగ్గర రంగులో ఉండే నీలిరంగుని పురాణాల్లో ఆయనకు అంకితం ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే కృష్ణుడు కొలువైన మధుర లాంటి ప్రదేశాల్లో హోలీ సెలబ్రేషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఈ రంగు విశ్వాసం, ఆధ్యాత్మిక, సానుకూల శక్తికి సూచికగా భావిస్తారు.
గులాబీ: ఈ కలర్ నచ్చని అమ్మాయిలు ఉండరేమో. తమ ఆనందాన్ని తెలియజేసేందుకు ఈ రంగు ఉపయోగిస్తారు. స్నేహానికి ప్రతీకగా కూడా ఈ రంగును చల్లుకుంటారు.
నారింజ: నారింజ (ఆరెంజ్) ఇది సానుకూలతకు
ప్రతీక. ఈ రంగుని కేవలం తమ ప్రియమైన వారిపై మాత్రమే చల్లుతారు. ఈ రంగు ఆధ్యాత్మికతకు ప్రతీక అని విశ్వసిస్తారు
ఊదా: రాచరికం, ఆధ్యాత్మికం, జ్ఞానాన్ని సూచిస్తుంది.
పురాణ కథ
ఈ పండుగ గురించి పురాణాలలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాక్షసరాజైన హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కావడంతో తన శత్రువైన విష్ణుమూర్తిని కొలవడం ఇష్టం లేని హిరణ్యకశిపుడు తన కొడుకుని చంపడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
దాంతో తన చెల్లెలు హోలికను పిలిచి ఒక వస్త్రం ఇచ్చి దీన్ని కప్పుకొని ప్రహ్లాదుడిని తీసుకొని మంటల్లో దూకమన్నాడు. హోలిక కప్పుకున్న వస్త్రం గాలికి కొట్టుకు పోయింది దానితో హోలిక మంటల్లో తగలబడిపోయింది. శ్రీమహావిష్ణువు అనుగ్రహం వలన ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడ్డాడు. హోలిక దహనానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటున్నాం.
కొన్ని జాగ్రత్తలు
మాయిశ్చరైజర్: హోలీ రంగుల్లో చాలావరకు రసాయన రంగులే ఉంటాయి. ఇవి చర్మాన్ని పొడిబారేలా చేసి చికాకు కలిగిస్తాయి. ఈ రసాయనాల ప్రభావం చర్మంపై నేరుగా పడకుండా చర్మంపై మాయిశ్చరైజర్‌ను వాడాలి.
సన్‌స్క్రీన్: హోలీని సాధారణంగా పగటిపూట జరుపుకుంటారు. కాబట్టి సూర్యరశ్మి చర్మానికి హాని కలిగిస్తుంది. ఎండలో హోలీ ఆడేటప్పుడు సూర్య కిరణాలు చర్మానికి హాని కలిగించకుండా సన్‌స్క్రీన్ ఒక కవచంగా పనిచేస్తుంది.
లిప్‌బామ్: రంగులు పెదాలను పొడిబారేలాచేస్తాయి. పెదవులు ఎండిపోకుండా రంగు మరకలు పడకుండా ఉండటానికి లిప్ బామ్ రాసుకోవాలి.
జుట్టుకు నూనె: హోలీ రంగులు జుట్టును తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే ముందుగా నూనె పూయడం రక్షణగా ఉం టుంది. తద్వారా రంగులు కడుక్కోవడం సులభమవుతుంది.
సహజ రంగులు వాడుదాం
ప్రాచీన కాలంలో చెట్ల ఆకులు, పూలతో ముఖ్యంగా మోదుగ పువ్వులను ఉడికించి రసం చేసి ఆ ద్రవాలను ఒకరిపై ఒకరు చల్లుకునేవారు. తర్వాత తరంవారు పసుపు కుంకుమ నీళ్లలో కలిపి రంగులు చల్లుకునేవారు. ఇప్పటి తరంవారు ఇంకొక అడుగు ముందుకేసి రసాయనాలతో కలిపిన రంగులు కోడిగుడ్లు, బురద ఇంకా విషపూరితమైన ద్రావణాలతో హోలీని జరుపుకుంటున్నారు.
ఒక్కరోజు సరదా కోసం జరిగిన పండుగ ప్రభావం రెండు మూడు నెలల వరకు రంగుల ప్రభావం ఉంటుంది. క్యాన్సర్ కారకాలైన రసాయనాలు ఉపయోగించడం ద్వారా చర్మ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా ప్రకృతిలో కాలుష్యం కూడా ఏర్పడుతుంది.