ఎల్బీనగర్/మహేశ్వరం, అక్టోబర్ 9: పోక్సో కేసులో నిందితుడికి ఎల్బీ నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఫాతిమా నగర్ వట్టేపల్లికి చెందిన మహమ్మద్ అల్తా జిల్దాని హయత్‌నగర్‌లోని కుంట్లూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, భార్య సోదరి అయిన మైనర్‌ను బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2019లో బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి, ఎల్బీనగర్ లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టారు. బుధవారం కోర్టులో కేసును విచారించిన న్యాయమూర్తి ఆధారాలను పరిశీలించి దోషిగా నిర్ధారించారు. జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం అందజేశారు.