26-03-2025 02:36:36 PM
- సరూర్ నగర్ లో 2023లో సంచలనం సృష్టించిన యువతి హత్య
- నిందితుడికి జీవితఖైదు విధించిన జిల్లా కోర్టు
ఎల్బీనగర్: సరూర్ నగర్ లో 2023లో జరిగిన అప్సర హత్య కేసులో పూజారికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్న అయ్యగారి వెంకట సాయి కృష్ణ నిత్యం ఆలయానికి వస్తున్న ప్రైవేటు ఉద్యోగి, నటి అయిన అప్సరతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నాడు. వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తరువాత అప్సర తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడిపై ఒత్తిడి చేసింది. అతడికి ఇప్పటికే వివాహం జరిగింది. దీంతో అప్సరను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. సమాజంలో గౌరవనీయమైన పదవిలో ఉన్నందున ఆమెను చంపాలని పథకం వేశాడు. ఈ క్రమంలో మాట్లాడుకుందాం అని అప్సరను కారులో శంషాబాద్ కు తీసుకెళ్లాడు.
అప్సరను చంపి రెండు రోజుల అనంతరం కారులో మృతదేహాన్ని సరూర్ నగర్ తెచ్చాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ పైపులైన్ లో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అనంతరం అప్సర కనిపించడం లేదని కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో వెంకట సాయికృష్ణ కదలికలపై పోలీసులు నిఘా పెట్టి, అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి, పూర్తి ఆధారాలను కోర్టుకు అందజేసి, నిందితుడు వెంకట సాయి కృష్ణను జైలుకు తరలించారు. ఈ కేసును ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు విచారించింది. ఈ మేరకు బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు వెంకట సాయి కృష్ణకు జీవితఖైదు, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది. మృతురాలి కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లించాలని తీర్పు వెల్లడించినట్టు రంగారెడ్డి జిల్లా కోర్టు పీపీ రవికుమార్ తెలిపారు.