అవయవదానంలో ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ
ఇప్పటివరకు 5,541 మందికి అవయవ మార్పిడి
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): అవయవాలు పనిచేయక ప్రాణాపాయ స్థితిలో కొందరు, అనారోగ్యంతో ఎప్పుడు చనిపోతారో తెలియని మరికొందరు. అలాంటి వారికి అవయవ దానం చేస్తే ఇబ్బందుల్లో ఉన్నవారి ప్రాణాలను కాపాడగలం. మరణంలోనూ ఇతరులకు ప్రాణదా నం చేసేందుకు ప్రభుత్వం 2013లో ప్రారంభించిన జీవన్‌దాన్ కార్యక్రమంతో అనేక మంది ప్రాణాలను కాపాడారు. ఈ నేపథ్యం లో శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అవయవదానంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించింది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియ పాటిల్ చేతుల మీదుగా జీవన్‌దాన్ తెలంగాణ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత ఈ అవార్డును స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2017, 2023లో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఏడాది కేంద్రం నుంచి సుశృత అవార్డును సాధించింది.
ఇతరులకు ప్రాణదానం...
అవయవ దానం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో 2012లో ప్రభుత్వం జీవన్‌దాన్ ఆలోచన చేసింది. 2013లో ప్రారంభమైన తర్వాత జీవన్‌దాన్ కార్యక్రమాన్ని సమీక్షించే బాధ్యత నిమ్స్ హాస్పిటల్‌కు అప్పగించారు. గతంతో పోలిస్తే అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో ఇది సాధ్యమైంది. జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా అవయవదానం చేసే వారి పేర్లు నమోదు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకు 24,506 మంది నమోదు చేసుకున్నారు. ఇందులో 1,465 దాతల నుంచి 5,541 అవయవాలు, కణజాలాలను సేకరించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్రచికిత్సలను విజయవంతంగా చేసి ప్రాణాలను కాపాడారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 40 హాస్పిటళ్లలో అవయవమార్పిడికి అనమతులున్నాయి. వీటికి నిబంధనల మేరకు ప్రభుత్వం అనుమతిలిచ్చింది. జీవన్‌దాన్‌లో 7,257 మంది రోగులు మూత్రపిం డాల కోసం, 6,719 మంది రోగులు కాలేయం కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
అవగాహన పెరిగింది
తెలంగాణలో అవయవదానంపై అవగాహన పెరిగింది. రాష్ట్రంలో 5,541 మంది ప్రాణాలు కాపాడేందుకు జీవన్‌దాన్ కృషిచేసింది. నిమ్స్, ఉస్మానియా, గాంధీలో అవయవమార్పిడి పెద్దఎత్తున జరుగుతుంది. అవయవాలు అవసరమైన రోగుల రిజిస్ట్రేషన్ సీనియారిటీ ప్రకారం అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నాం.
స్వర్ణలత, జీవన్‌దాన్ ఇన్‌చార్జి