calender_icon.png 18 January, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైఫ్ చేంజ్ థెరపీ!

05-08-2024 12:00:00 AM

ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందించేది కళ. చక్కని సంగీతం హాయినిస్తుంది. అలాగే నృత్యం, చిత్రకళ, ఇతర లలిత కళలు మనిషి ఎదుగుదలకు దోహదం చేస్తాయి. జ్ఞ్ఞానేంద్రియాలను ప్రేరేపించే ఈ కళలతో మనసుకు కూడా ప్రశాంతత అందుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే వీటిని థెరపీలుగా కూడా ఉపయోగిస్తున్నారు. తద్వారా శారీరక, మానసిక సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతున్నారు.

సంగీతం.. 

శ్రావ్యమైన సంగీతం వింటే తెలియకుండానే మనసు తేలికపడుతుంది. జర్నల్ ఆఫ్ మ్యూజిక్ థెరపీలో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం ఆందోళన, దీర్ఘకాలిక బాధలు, నొప్పుల నుంచి సంగీతంతో ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన గాయకుల పాటలు వినడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.

ఆర్ట్ థెరపీ!

ఆర్ట్ థెరపీ ఒకరకమైన మానసిక చికిత్స. మానసిక అనారోగ్యాన్ని సరిచేయడానికి, ఆందోళన, నిరాశ తగ్గించడానికి ఈ థెరపీ ఉపయోగిస్తారు. క్యాన్సర్‌తో  పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులకు ఆర్ట్ థెరపీ చక్కని ఔషధం. బొమ్మలు గీయడం, వాద్య పరికరాలు, సంగీతం సాధన చేయడంతో శారీరక రుగ్మతను జయించిన వాళ్లు ఎందరో ఉన్నారు. వైద్యానికి అనుబంధంగా ఆర్ట్ థెరపీ తీసుకుంటే.. ఫలితం మెరుగ్గా ఉంటుందని నిపుణుల చెబుతున్నారు.

డ్యాన్స్..

డ్యాన్స్ ఉరిమే ఉత్సాహాన్ని ఇస్తుంది. నృత్యాన్ని చూసినా, చేసినా మానసికంగా మేలైన మార్పు కలుగుతుంది. నృత్యం వల్ల కలిగే శారీరక శ్రమ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కూడా డ్యాన్స్ థెరపీ ఒక మార్గం. 

పబ్లిక్ ఆర్ట్..

నలుగురితో కలివిడిగా ఉండడం, మనసులో మాట పంచుకోవడాన్ని పబ్లిక్ ఆర్ట్ అంటారు. జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్‌లో  ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నచ్చిన ప్రదేశంలో, ఇష్టమైన మనుషుల మధ్య గడపడంతో ఆరోగ్యం మెరుగుపడుతుందట. మానసిక ఆరోగ్యం బాగాలేనప్పుడు విహారానికో, యాత్రలకో వెళ్లమని వైద్యులు సూచించడం వెనుక ఆంతర్యానికి కారణం ఇదే!