24-03-2025 12:00:00 AM
అలకు ముందున్న అల
జాడ తెలియదు...
కానీ, ప్రతి అల చిరునామా
జ్ఞాపకాల అరలో పదిలం..!
జీవితమంటే
శిల్పంగా మారిన
అలల తాకిడి తిన్న శిలనేగా!
మనసు లోపల రాసుకున్న
కవిత్వమేగా .. జీవితం!
చీకటో వెలుతురో
ముందే ఫలితం తెలియదు..
ఆశ మనసు ఆడే అష్టాచెమ్మా!
పడి లేవడం..
శిశిరం రాల్చిన
ఆకుల వెంటే
వసంతం పరచుకుంటుంది..
పండుగ చేసుకోమని
కొమ్మలకు చెప్పేదెవరు?!
కాలం చిరునవ్వుల్ని
భరోసా ఇస్తుంది..
శిశిరాన్ని మోసే ఓపిక
మనకూ ఉండాలి!
మనవి చిన్న వలయాలు..
రెక్కలెక్కడివి ఎగరడానికి?
పిచ్చివాళ్ళం కదా
ఉన్నదాంట్లోనే సర్దుకుంటాం!
చిన్న జీవితాలు
పెద్ద వేదాంతాలు.. మనవి!!