- వాహన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాం
- పాఠ్యాంశాల్లో ట్రాఫిక్ అవగాహన అంశాలను చేరుస్తాం
- హైదరాబాద్‌లో మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థ తీసుకొస్తాం
- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు మరింత బాధ్యతగా ఉండి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
శుక్రవారం ఖైరతాబాద్ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్స వాలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై ఫ్ల్లకార్డులతో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతు న్నా చాలా మందిలో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించనివారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తామని, వారి పేరిట ఉండే వాహన రిజిస్ట్రేషన్ కూడా తీసివేస్తామని హెచ్చరించారు. అయినా వినకపోతే కఠిన చర్యలకు వెనకాడమన్నారు. ఇప్పటివరకు 7వేల మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ మరో ముగ్గురికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరారు. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ సహకారంతో ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 1,000 పాఠశాలల్లో ట్రాఫిక్ అవగాహన పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయిందని, పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేదన్నారు. రవాణా శాఖ, పోలీసు, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సందర్భంగా “ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం” అనే స్లోగన్ ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు.
కార్యక్రమంలో రవాణా శాఖ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వ ప్రసాద్, జాయింట్ కమిషనర్లు రమేశ్, మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, రవాణా శాఖ అధికారులు రవీందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కమల్‌కాంత్, నరేంద్ర నాయక్, మార్గం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.