వికారాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): పాఠకులు జిల్లాలోని గ్రంథాలయా లను ఉపయోగించుకొని విజ్ఞానవంతులు కావాలని చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా వచ్చిన చీఫ్ విప్ మాట్లాడుతూ జిల్లాలో 17 గ్రంథాలయాల్లో 3 లక్షల 10 వేల పుస్తకాలు పాఠకులకు అంటుబాటులో ఉన్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. పుస్తకపఠనం వల్ల కొత్త విషయాలు తెలుస్తాయన్నారు. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకోడానికి పుస్తక పఠనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో చదువుకున్న ఎంతో మంది మేధావులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు సమకూరుస్తామన్నారు. లైబ్రరీ సెక్రటరీ సురేశ్‌బాబు, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్య క్షుడు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.