కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అనంతమైన విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 14వ తేదీ నుండి జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలని అన్నారు. గ్రంధాలయాలలో మన ప్రాచీన చరిత్ర, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు, దేశాభివృద్ధికి అలుపెరగని కృషిచేసిన మహానుభావుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, ప్రపంచాన్ని నడిపిస్తున్న సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పొందవచ్చని, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ గ్రంథాలయంలో పాఠకుల కొరకు, పోటీ పరీక్షల అభ్యర్థుల కొరకు అవసరమైన పుస్తకాలు, పత్రికలు, మెటీరియల్ ను అందుబాటులో ఉంచడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకొని ఇటీవల జరిగిన డి.ఎస్.సి. గ్రూప్-4, పోలీస్ ఉద్యోగాలలో దాదాపు 20 మంది వరకు ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు, యువత భవిష్యత్తుకు అవసరమైన సలహాలు, సూచనల కొరకు వారంలో ఒక గంట కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన చిత్రలేఖనం, మ్యూజికల్ చైర్, పుస్తకాల ప్రదర్శన, వ్యాసరచన, కవి సమ్మేళనం, పాటల పోటీలు, రంగోలి పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి సరిత, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు, జిల్లా పరీక్షల అధికారి ఉదయ్ బాబు, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, గ్రంధాలయ అధికారులు సదానందం, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.