calender_icon.png 21 October, 2024 | 5:12 PM

అబద్దాల హరీష్ రావు... ఇండ్ల వద్దకు వచ్చి మాట్లాడు

21-10-2024 03:05:36 PM

బ్రోకర్లతో కలిసి మమ్మల్ని మోసం చేశావు

దారి ఖర్చులకు రూ.50,000 ఎవరికి ఇచ్చావు

మాజీ మంత్రి హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లన్న సాగర్ పునరావాసులు

హరీష్ రావు ఫ్లెక్సీని చెప్పుతో కొట్టి దహనం చేసిన పునరావాసులు..

సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

గజ్వేల్ (విజయక్రాంతి): కడుపులో పెట్టి చూసుకుంటామని అబద్ధాలు చెప్పి ఇల్లు ఖాళీ చేయించిన హరీష్ రావు మల్లన్న సాగర్ కాలనీలోకి వచ్చి మాట్లాడాలని మల్లన్న సాగర్  పునరావాసులు అన్నారు. సోమవారం తమను నిలువునా అన్యాయం చేశాడంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పల్లెపహాడ్ కాలనీలో మల్లన్న సాగర్ నిర్వాసిత అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు హరీష్ రావు ఫ్లెక్సీని చెప్పుతో కొట్టి దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని విధాలా న్యాయం చేస్తామని, కడుపులో పెట్టి చూసుకుంటామని మల్లన్న సాగర్ నిర్వాసితులను మాజీ మంత్రి హరీష్ రావు మోసం చేశారన్నారు.

ఆయా గ్రామాల సర్పంచులు, బ్రోకర్లు, కలెక్టర్లతో కలిసి కమిషన్లు దండుకొని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీలు పూర్తి చేయకుండా, ఒంటరి మహిళలు, ఒంటరి వారికి  ఇల్లు, ప్యాకేజీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎక్కడో దొంగ చాటున ప్రెస్ మీట్ లు పెట్టి తమను గొప్పగా చిత్రీకరించుకుంటున్న మాజీ మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్ పునరావాస గ్రామాలకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఇంటికి దారి ఖర్చులకు రూ.50,000 ఇచ్చామంటూ మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో విలేకరులతో చెప్పుకొచ్చారని, అలా లెక్క పెడితే కోట్ల రూపాయల డబ్బులు ఎవరికి ఇచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పునరావాసం పేరుతో తమకు అన్యాయం చేసి మాజీ మంత్రి హరీష్ రావు, అధికారులు, బ్రోకర్లు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల గురించి మాట్లాడాలనుకుంటే ఆర్ అండ్ ఆర్ కాలనీకి వచ్చి మాట్లాడాలని అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల నిరసనకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్,  స్థానిక నాయకులు నర్సింహారెడ్డి, రాములు, స్వామి, రమేష్, ప్రమోద్ లు సంఘీభావం తెలిపారు.