calender_icon.png 25 December, 2024 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నార్తుని అక్షరాయుధం

09-09-2024 02:30:00 AM

సమాజమే తన కార్యరంగమని భావించిన కవికి ప్రజల పక్షాన నిలిచి, నిలేయాల్సిన అన్యాయాలెన్నో స్పష్టంగా కనిపిస్తాయి. తన అక్షరం చేయాల్సిన యుద్ధం ప్రజలున్న చోటే అని నిర్ణయించుకొని సమాజంలో పేరుకుపోయిన అన్యాయం, అకృత్యం, అసమానతలపై ధైర్యంగా నిరసన గళం వినిపించిన కవి కాళోజీ. పేదోడి పక్షాన నిలిచి అక్షరాయుధం ప్రయోగించిన కవి ఆయన. చెప్పాలనుకున్నది చెప్పేసి, రాయాలనుకున్నది రాసేసి, కుండబద్ధలు కొట్టిన ప్రజా కవి, అక్షర శ్రీమంతుడు కాళోజీ. 

తాడిత, పీడిత ప్రజల పక్షపాతిగా నిఖార్సయిన కవిత్వాన్ని నిగ్గుటద్దంగా చూపిన ప్రజామిత్రుడు కాళోజీ. ఆవేదన, ఆలోచన, చేతన లు ఆయన కవిత్వంలోని ప్రతి పదంలో తలెత్తి కన్పిస్తాయి. నిజంగా ఆయన సిరాలోంచి ఒలికి కాగి తంపై రాలిన ప్రతి అక్షరం లక్షలకు కాదు, కోట్ల మె దళ్లకు పెను కదలికే. ప్రతి అక్షరాన్ని నిప్పురవ్వ అం టుకున్న బతుకుపాటగా, నిజం రాతగా మార్చిన మహనీయ, మాననీయ, మానవీయ కవి కాళోజీ.

‘మన పిల్లలను చంపి మనల బంధించిన/ మానవాధములను మండలాధీశులను/ మరచిపోకుండా గురుతుంచుకోవాలె/ కసి ఆరిపోకుండ బుస కొట్టుచుండాలె/ కాలంబు రాగానే కాటేసి తీరాలె’ రజాకార్లపై ఆయన సంధించిన ఈ కవితాస్త్రం మొత్తం ప్రజల కోపాగ్నికి ప్రతీక. మన కాళోజీ అంతర్జాతీయ కవి. ఖండాంతరాలకు ఆయన కవిత్వజ్యోతులు ప్రసరించాయి. ‘ఏ వెలుగులకీ ప్రస్థానం’ అని ప్రశ్నించినపుడు ప్రతి పేదవాడి గుండెల్లో కవిత్వ దీపశిఖగా తప్పనిసరిగా నిలిచి వెలిగే కవి కాళోజీ.

వెలకట్టలేని వ్యక్తిత్వం

కవిగా ఖచ్చితమైన అభిప్రాయాలను నొక్కి చెప్పిన కాళోజీ వెనకాడని కవిత్వాన్ని సామాజిక యవనికపై దర్శింపజేశారు. ప్రజలు మాట్లాడే జీవభాష వ్యవహారికమేనని అన్నారు. జీవధాతువు ముమ్మాటికీ మాండలికమేనని చెప్పి అదే కోవలో, కోణంలో కవిత్వాన్ని రాసి మెప్పించి ఒప్పించారు. రెండున్నర జిల్లాలదే దండి బాస అయినప్పుడు/ తక్కినోళ్ల నోళ్ల యాస/ తొక్కి నొక్కబడ్డప్పుడు/ ప్రత్యేకంగా రాజ్యం పాలు/ కోరడం తప్పదు  అంటూ ఆంధ్రప్రాంతపు భాషావాదులను ఆనాడే హెచ్చరించారు కాళోజీ.

సమకాలీన సామాజిక దృక్పథం మెండుగా కలిగిన కాళోజీ కవితామూర్తిమత్వానికి ప్రతిబింబం ‘నా గొడవ’. నిజానికి సమాజంలోని అందరి గొడవను తన గొడవగా చేసుకొని ఈ కవిత్వ సంకలనాన్ని వెలకట్టలేని అమూల్య ఆధునిక కవిత్వనిధిగా అందించారాయన. కులమతాతీత ప్రజాస్వామ్య వైఖరిని కనబరిచి తన ప్రగతిశీల దృక్పథమేమిటో తెలిపారు. బతుకే ప్రజలు, ఉద్యమాలుగా సామాజిక జీవనాన్ని కొనసాగిస్తూ కవిత్వంతో ఎంతో శక్తినిచ్చే భావప్రసారాన్ని కాళోజీ అందించడంలో సఫలీకృతులయ్యారు.

స్వేచ్ఛ, వ్యక్తిత్వం రెండూ ముఖ్యమే

స్వేచ్ఛ, వ్యక్తిత్వం రెండూ మనిషి ప్రధానాంశాల ని కవిత్వంలో వాటిని నూటికి నూరు శాతం ఆచరించి చూపిన మానవీయ కవి కాళోజీ. నిరసన గ ళానికి, ఎలుగెత్తే ప్రశ్నకు నిజరూపంగా నిలిచారు వారు. కవిగా, ఉద్యమకారునిగా ఆయనది వైవిధ్యమైన పాత్ర. తెలంగాణ వైతాళికునిగా కాళోజీని పే ర్కొని తీరాలి. ఇక్కడి సాంస్కృతిక వాతావరణంలోంచి ఆయన క్రమంగా ఎదిగి శిఖర ప్రస్థానం చే శారు. తెలంగాణేతరుల మనసునూ గెలుచుకున్నా రు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను చెబుతూ, ఓటు వేసేప్పుడే ఆలోచనకు పదును పెట్టమని ప్ర జలను హెచ్చరించారు. నిరంకుశ ప్రభుత్వాలను ని ర్భీతితో ఎదిరించారనడానికి ఆయన కవిత్వమే ని దర్శనం. జీవితం, కవిత్వం రెండింటినీ తన చివరి ఊపిరి వరకు భావితరాలకు ఆదర్శప్రాయంగా నడిపిన మహాకవి, తెలంగాణ సాహిత్యపు సిరి కాళోజీ.

‘పుటక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది’ అన్నట్టుగా దేశం కోసం, సమాజం కోసం బతికిన మహానుభావుడు ఆయన. నిర్భయంగా మాట్లాడి అదే ప్రకంపనాన్ని కవిత్వంలోనూ చూపారు. నిరంకుశత్వంపై ఎగసిన బావుటా ఆయన. అన్యా యంపై ఎగిసిపడ్డ కవితాగ్ని శిఖ. ధిక్కార స్వర సమరశీలి. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం నుండి ఎదిగి వచ్చిన అక్షర కాంతిపుంజం కాళోజీ. పోరాడేతత్వం, సామాజిక స్పృహ ఉన్నంత కాలం కాళోజీ కనిపించి, వినిపిస్తూనేవుంటారు.

ఎవరి మాట కోసమో, పొగడ్త కోసమో, సంకీర్తన కోసమో ఆయన సిరా పొంగి ప్రవహించలేదు. సహజంగా, స్వేచ్ఛగా జన జీవన సజీవ సత్యాల్ని మాత్రమే ఆవిష్కరించింది. మాట్లాడని నోరు, కష్టం చేసి తిననోచని చేతులు, సేవ చేసి ప్రేమించనోచని శరీరం, మనిషి స్పర్శ నోచని మానవుడు కాళోజీ స్వభావానికి సరిపడవు. ‘కంట్లో కన్నీరును కత్తిగా మలచుకోండి’ అంటారొకచోట కాళోజీ. తన బతుకంతా దేశానిదైన మనిషిగా ఆయన కన్పిస్తారు. కాళోజీ బతుకు ఆదర్శం. అది మనిషితనానికి కొలమాన సదృశం.  సమాజాన్ని తన కవిత్వంతో ప్రభావితం చేసిన అత్యంత శక్తిమంతుడుగా కాళోజీ చరిత్రలో నిలిచిపోయారు. 

 డా. తిరునగరి శ్రీనివాస్

9441464764 

తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం

కాళోజీ నారాయణరావు పూర్తిపేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మికాంత్ శ్రీనివాసరాం రా జా కాళోజీ. ఆయన కర్ణాటకలోని బీజాపూర్ జి ల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. తల్లి ర మాబాయమ్మ, తండ్రి కాళోజీ రంగారావు. బీ జాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు వచ్చిన వారి కుటుంబం మడికొండలో స్థిరపడింది. ఆంగ్లభా ష నేర్చుకొని, తెలుగుభాషను తక్కువ చేసి చూ సేవారికి తన కవితలద్వారా కాళోజీ చురకలు  అంటించారు. 

‘ఏ భాష నీది-యేమి వేషము రా? ఈ భాష ఈ వేష-మెవరి కోసమురా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా, చా వవెందుకురా?’.  ‘సాగిపోవుటే బతుకు -ఆగిపోవుటే చావు. సాగిపోదలచిన -ఆగరాదిచటెపు డు. ఆగిపోయిన ముందు -సాగనే లేవెపుడు. వేచియుండిన పోను -నోచుకోనే లేవు. తొలగితో వెవడిచ్చు -తోసుకొని పోవలయు. బ్రతుకు పోరాటము పడకు ఆరాటము’.  ‘ఆత్మకు అవమా నం జరిగినా దవడ పళ్ళు రాలుతాయన్న భ యంతో- పెదవి విప్పలేని మనిషి ఏం మని షి? నష్ట భయంతో పరిణామంగా -ఎదురయ్యే కష్టానికి జడిసి ఇష్టమున్న పని మానుకుంటే మనిషి ఏం మనిషి?’  ఇలా రాస్తూ పోతే, కా ళోజీ వారి అద్భుత కవితా ప్రయోగాలు ఎన్నెన్నో.

వీరిని భారత ప్రభుత్వం 1992లో పద్మ వి భూషణ్ అవార్డుతో సత్కరించింది. మన రాష్ట్ర ప్రభుత్వం వీరి జయంతిని ‘తెలంగాణ (మాండలిక) భాషా దినోత్సవం’గా ప్రకటించింది. వరం గల్లులోని వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయం వారు ఆయనకు తొలి గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించారు. వారి కాంస్య విగ్రహాన్ని హన్మకొండలో ఏర్పాటుచేశారు.

హన్మకొండ లో వారి కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. 1914 సెప్టెంబర్ 9న జన్మించిన కాళొజీ తన 88వ ఏట 2002 నవంబర్ 13న అనారోగ్యంతో కన్నుమూశారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నడిచిన బాట, రాసిన కవిత్వం, ఆచరించిన ఆదర్శవంతమైన జీవితం ద్వారా గొప్ప స్ఫూర్తినిస్తూ, చిరంజీవిగానే ఉం టారు. తెలంగాణ భాష, సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తి కోసం అలుపెరగక కృషి చేయడమే ప్రస్తుతం మన కర్తవ్యం.

 గూళ్ళ వెంకటయ్య, 99633 08744