calender_icon.png 14 November, 2024 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటార్నీ జనరల్‌కు లేఖ!

12-11-2024 01:36:52 AM

నేడు ఢిల్లీకి గవర్నర్

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): ఈ-రేస్ వేగం పుంజుకుంది.. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రజాప్రతినిధులను విచారణ చేసేందుకు కావాల్సిన గవర్నర్ అనుమతికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకున్నట్టుగా సమాచారం. అనుమతివ్వాలా.. వద్దా అనే దానిపై న్యాయ సలహా కోరుతూ రాజ్‌భవన్ వర్గాలు ఢిల్లీలోని అటార్నీ జనరల్‌కు లేఖ రాసినట్టుగా తెలుస్తున్నది.

గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్‌పై ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణకు ఆదేశించడం.. ఆవెంటనే ఏసీబీ విచారణ చేపట్టడం.. ఆపై ప్రజాప్రతినిధుల పాత్రపై విచారణ ముందుకు సాగేలా అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేయడం చకా చకా జరిగిన విషయం తెలిసిందే.

పైగా ఫార్ములా ఈలుఠరేస్ వ్యవహారంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను దృష్టిలో పెట్టుకునే.. ఆయన్ను విచారణ చేయడానికే.. ఇలా గవర్నర్ అనుమతి కోసం పావులు కదిపారనే చర్చ జరుగుతోంది.

ఈనేపథ్యంలో న్యాయ సలహా కోరుతూ అటార్నీ జనరల్‌కు రాజ్‌భవన్ నుంచి లేఖ వెళ్ళిందని, అక్కడి నుంచి వచ్చే సలహా ప్రకారం దర్యాప్తు ముందుకు సాగుతుందనే సమాచారం రాజకీయ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.

ఇంతలోనే బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ తన అనుచరులతో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి సీఎం రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వెళ్ళడం రాజ్‌భవన్ నుంచి ఆటార్నీ జనరల్‌కు లేఖపై జరుగుతున్న చర్చకు బలం చేకూర్చేలా ఉంది.

ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ  రెగ్యులర్ విచారణ చేపట్టిన ఏసీబీ.. ఇందులో ప్రజాప్రతినిధుల ప్రమేయంపై ముందుకు సాగడానికి వీలుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిని కోరుతూ విజ్ఞప్తి చేసింది.

ఇప్పటి వరకు విచారణలో వెల్లడైన అంశాలు.. రూ. 55 కోట్లు  అప్పనంగా చెల్లించడంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ నుంచి, సంబంధిత అధికారుల నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని పొందుపర్చుతూ.. ఇందులో ప్రమేయం ఉన్న ప్రజాప్రతినిధులను విచారణ చేయడానికి వీలుగా అనుమతి కోరుతూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

దీనిని పరిశీలించిన రాజ్‌భవన్ వర్గాలు ఆటార్నీ జనరల్ న్యాయ సలహాకోరుతూ లేఖ రాసినట్టు తెలుస్తుంది. ఏసీబీ నుంచి వచ్చిన సమాచారం, దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఆ లేఖలో పొందుపర్చారని.. వీటిని పరిశీలించి ప్రజాప్రతినిధులను విచారించేందుకు ముందుకు వెళ్ళవచ్చా.. లేదా న్యాయ సలహా ఇవ్వాలని అందులో కోరినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి వచ్చే న్యాయసలహాను అనుసరించి రాజ్‌భవన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

నేడు ఢిల్లీకి గవర్నర్..

ఇదిలా ఉండగా.. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళుతున్నట్టు సమాచారం. ఈసారి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ముఖ్యమైనవారిని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు అధికార కాంగ్రెస్.. అటు ప్రతిపక్ష నేతల మధ్య ఫార్ముల్ ఈవునరేస్ విషయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఇప్పటికే బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు.

పైగా మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీకి వెళుతున్నారు. ఇదే సమయంలో గవర్నర్ కూడా మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళుతుండటంతో.. మొత్తానికి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయంలో సంచలన నిర్ణయాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చర్చ మొదలయ్యింది.