పిల్‌గా స్వీకరించిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాం తి): కామారెడ్డి జిల్లా బిచ్‌కుంద మండలంలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకో ర్టుకు లేఖ అందింది. అరాచక శక్తులతో అధికారులు కుమ్మక్కయి ఇసుక అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారని, దీన్ని అరికట్టడానికి జోక్యం చేసుకోవాలని కోరు తూ కామారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏ ప్రకాశ్ హైకోర్టుకు లేఖ రాశారు. అక్రమ మైనింగ్ వల్ల ప్రభు త్వ ఖాజానాకు రోజుకు రూ.20 నుంచి 30 లక్షల నష్టం వాటిల్లుతోందన్నారు. ఖడ్గంశెట్లూరు శివారులోని ఆరు క్వారీల్లో ఇసుక తవ్వకాలకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కాలపరిమితి ముగిసినా తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మైనింగ్ జరిగినా అధికారులు 18 లక్షలే అన్నట్లు రికార్డు చేశారని ఆరోపించారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశించాలని కోరారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రతివాదులుగా భూగర్భ, గనుల శాఖ, రెవెన్యూ, హోం, రవాణా శాఖల ముఖ్యకార్యదర్శులు, గనుల శాఖ ఎండీ, సహాయ డైరెక్టర్, కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ, బిచ్‌కుంద తహసీల్దార్లను చేర్చింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావు బెంచ్ సోమవారం విచారణ చేపట్టనుంది.