calender_icon.png 19 September, 2024 | 10:37 PM

గుండెలు పిండేస్తున్న డాక్టర్ తల్లి లేఖ

07-09-2024 02:01:31 AM

కోల్‌కతా, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఓ రాక్షసుడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ డాక్టర్ అమానవీయ ఘటన దేశ వ్యాప్తంగా ఎందరో గుండెలను కదిలించింది. ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ దేశమంతా ఒకతాటిపైకి వచ్చింది. ఆమెకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పోలీసుల దర్యాప్తు మీద తీవ్ర విమర్శలు వెల్లు వెత్తాయి. దీంతో దేశంలో మహిళా డాక్టర్ల రక్షణకు ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఈ  క్రమంలో టీచర్స్‌డే సంద ర్భంగా తన కూతురు గురించి తెలియజేస్తూ ఆ డాక్టర్ తల్లి తన ఆవేదనను ఓ లేఖ రూపంలో విడుదల చేశారు.  ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఎందరినో కంటతడి పెట్టిస్తున్నది. “మమ్ములను ఒంటరిని చేసి మధ్యలో వదిలిపోయిన ఆ డాక్టర్ తల్లిని నేను. గురుపూజోత్సవం సందర్భంగా టీచర్స్ అందరికీ నా కుమార్తె తరఫు న నమస్కరిస్తున్నా.

చిన్ననాటి నుంచి డాక్టర్ కావాలని కలలు కనేది. తనలో ఆ స్ఫూర్తిని నింపింది మీరే. మీలాంటి గొప్ప ఉపాధ్యాయులు తనకు చదువు చెప్పడం వల్లే తన కలను సాకారం చేసుకుంది.” అంటూ టీచర్స్‌కు దండాలు పెట్టింది. ఈ సందర్భంగా తన కూతురితో జరిగిన సంభాషణను ఆ లేఖలో పంచుకుంది. ‘అమ్మా నాకు డబ్బు వద్దు. నా పేరు ముందు చాలా డిగ్రీలుండాలి. ఎక్కువమంది పేషెంట్లకు వైద్యం అందించాలి’ అని చెప్పేది. హత్యాచార ఘటన జరిగిన రోజు కూడా ఆస్పత్రిలో పేషెంట్లకు సహాయం చేసింది. కానీ డ్యూటీలో ఉండగానే ఆమెను చంపేశారు. నా కుమార్తెకు న్యాయం కావాలి’ అంటూ ఆ తల్లి చేసిన వినతి గుండెను పిండేస్తోంది. 

ప్రిన్సిపాల్ ఇంట్లో ఈడీ సోదాలు

ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఇంట్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితులైన ముగ్గురి ఇండ్లు, వారికి సంబంధించిన వివిధ ప్రాంతాల్లో కూడా ఈడీ దాడులు నిర్వహించింది. అలాగే ఆస్పత్రి డాటా ఎంట్రీ ఆపరేటర్ ప్రసూన ఛటర్జీ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు చేసింది. కాలేజీలో అక్రమాలు, అవినీతి, మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ కేసు నమోదు చేసింది. డాక్టర్‌పై హత్యచార ఘటన కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తుండగా సందీప్ చేసిన అక్రమాలు, అవినీతి బయటపడ్డాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సందీప్‌పై కేసు నమోదు చేయడంతోపాటు ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. 

సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

కాగా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన లో ఆరోపణలు ఎదుర్కొటున్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ఘోష్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి వ్యవహారంలో తనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తునకు వ్యతిరేకంగా సందీ ప్ సుప్రీంలో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్‌ను  కోర్టు కొట్టి వేసింది.