calender_icon.png 31 October, 2024 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలిసి పనిచేస్తాం.. చూద్దాం!

01-07-2024 12:54:20 AM

తెలంగాణలోనూ బీజేపీతో చేతులు కలుపుతాం: పవన్

నిర్ణయం బీజేపీ అధిష్ఠానానిదే: బండి

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడా ఉంటా... రుద్రమ దేవి సినిమాలో అల్లు అర్జున్  డైలాగ్ ఇది..  సినిమా నటుడు, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఈ డైలాగ్ ఇప్పుడు అతికినట్లు సరిపోతుంది. శనివారం కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన పవన్.. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని వ్యాఖ్యానించారు. ‘జై జనసేన, జై బీజేపీ’ అంటూ నినాదాలు కూడా చేశారు. సోమవారం తెలంగాణ జనసేన నేతలతో ఆయన హైదరాబాద్‌లో భేటీ అవుతారని కూడా సమాచారం.

ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలంగా మారుతున్న తరుణంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీతో కలిసి ముందుకు సాగాలని పవన్ భావిస్తున్నట్లు జనసేన శ్రేణులు చెబుతున్నాయి. ఇదే సందర్భంలో ఆదివారం బీజేపీ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో పొత్తుపై తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుం టుందని అన్నారు. పవన్ కల్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ అధిష్ఠానం ముందుంచారని దీనిపై రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ అధిష్ఠానం 8 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. పోటీ చేసిన 8 స్థానాల్లోనూ జనసేనకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఆ తరుణంలోనే ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో తెలం గాణలో బీజేపీ సొంతంగానే పోటీ చేసి 8 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మరికొన్ని స్థానాల్లో సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు పవన్ కల్యాణ్, బండి సంజయ్ పొత్తులపై చేసిన కామెంట్లు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.