కరోనా ప్రపంచానికి అతిపెద్ద పాఠం నేర్పింది. కరోనా ఒక్కటే కాదు.. ఇకపై వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉంటాయన్న హింట్ కూడా ఇచ్చింది.. అందులో భాగంగానే తాజాగా హెచ్‌ఎంపీవీ వైరస్ వచ్చింది. ఈ వైరస్ ప్రభావం పిల్లలు, వృద్ధులపై ఎక్కువుంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మరి వైరస్‌ను చంపలేమా అంటే.. కచ్చితంగా అంతం చేయొచ్చు. దానికి మందు మనిషి శరీరంలోనే ఉంది. దానిపేరు ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి). మనం తీసుకునే ఆహారమే.. దీనిపై పెట్టే ఖర్చే.. మనిషిని జబ్బుల నుంచి దూరం చేస్తుందని చెప్తున్నారు నిపుణులు..
నిజానికి వైరస్‌ను చంపే మందులు ఇప్పటిదాకా లేవు. మరి.. ఇప్పుడున్న మందులన్నీ ఏంటి? అవన్నీ వైరస్ వ్యాప్తి జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు మాత్రమే వాడే మందులు. వైరస్ ప్రభావం ఎక్కడ ఉందో అక్కడికే పరిమితం చేసే మందులు అవన్నీ. ఇది కరోనా అంతటి తీవ్రమైన వైరస్ అయితే కాదు. రక్తనాళాలను దెబ్బతీయడం, రక్తంలో గడ్డలు ఏర్పడటం వంటి ప్రమాదకర పరిస్థితులు ఇందులో ఉండవు. కాకపోతే.. న్యుమోనియా వచ్చి రక్తంలో ఆక్సిజన్ తగ్గితే మాత్రం హాస్పిటలో చేరి చికిత్స తీసుకుంటే మంచిదని వైద్యులు అంటున్నారు.
పిల్లలపై ప్రభావం
ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, ముఖ్యంగా శిశువుల్లో రోగ నిరోధక వ్యవస్థ తక్కువగా పనిచేస్తుంది. కాబట్టి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. సాధారణంగా ఈ వైరస్ లక్షణాలు బహిర్గతం కావడానికి మూడు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది. కొన్నిసార్లు వైరస్ లక్షణాలు బయటపడటానికి ఒకటి నుంచి రెండు వారాల వరకు సమయం పట్టవచ్చు.
వృద్ధులకు రిస్క్..
హ్యుమన్ మెటాన్యూమోవైరస్ అనేది శ్వాసకోశ వైరస్ అని వైద్యులు చెబుతున్నారు. ఇది చిన్న పిల్లలు, వృద్ధులు.. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారిని అటాక్ చేస్తుంది. దగ్గు, తుమ్ములు, కలుషిత పరిసరాల కారణంగా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(సీఓపీడీ) వంటి శ్వాస కోశ సంబంధ జబ్బులు ఉన్నవారు ఈ వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ మెడికల్ జర్నల్ జామా సైకియాట్రీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వైరస్ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మానసిక రోగులకు మరిన్ని సమస్యలు ఎదురవుతాయని, వీరికి చికిత్స కోసం సైకియాట్రిక్ ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని సూచించింది.
కనీస అవసరాలైన ఆహారం తీసుకోవడం, మందులు వేసుకోవడం కూడా వారికి ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంది. అందువల్ల వీరి నుంచి వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువని తెలిపింది. వ్యాధి తీవ్రమైతే వైరస్ వ్యాప్తి, తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. తమ పనులు తాము చేసుకోలేని మానసిక రోగులకు రిస్క్ మరింత ఎక్కువని అధ్యయనం వెల్లడించింది.
లక్షణాలు
హ్యుమన్ మెటాన్యూమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) వైరస్ వ్యాధి లక్షణాలు ప్రధానంగా.. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, కొంతమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గురక, ఛాతి, ఒళ్లు నొప్పులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే పిల్లల్లో, వృద్ధుల్లో న్యూమోనియా లేదా బ్రోంకైటిస్ వ్యాధి లక్షణాలకు దారి తీయొచ్చని వైద్యులు చెబుతున్నారు.
జాగ్రత్తలు
హెచ్‌ఎంపీవీని నివారించడం అనేది సాధారణ జాగ్రత్తలతో పాటు పరిశుభ్రత పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం, అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండటం. వాళ్లు ఉపయోగించిన వస్తువులు, దుస్తులను వెంట వెంటనే శానిటైజర్ చేయడం వల్ల వైరస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్తే మాస్క్ ధరించాలి. మరి ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
యాంటీ బయోటిక్స్ వాడొద్దు!
హెచ్‌ఎంపీవీ వైరస్ కొత్తది కాదు.. ఇది పాత వైరస్. వైరస్‌లు సాధారణంగా తేలికపాటి అనారోగ్యానికి కారణమవుతాయి. శిశువులు, చిన్నపిల్లలు, వృద్ధులలో న్యుమోనియాకు కారణమవుతుంది. శ్వాస సమస్యలుంటే హాస్పిటల్స్‌లో చేరి వైద్యుల పరివేక్షణలో చికిత్స తీసుకుంటే సరిపోతుంది.
ఈ శ్వాసకోశ వ్యాధి హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) చికిత్సలో యాంటీ బయోటిక్స్ అవసరం లేదు. సరైన హైడ్రేషన్ ఉండేలా జాగ్రత్తలు పాటిస్తూ.. పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే మంచిది.
డాక్టర్ రణదీప్ గులేరియా, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్
భయపడాల్సిన అవసరం లేదు!
ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉన్నదే.. నిన్న.. మొన్న కొత్తగా వచ్చిన వైరస్ కాదు. దీని లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు. మనకు రెగ్యులర్ సీజన్‌లో వచ్చే ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయో అదే మాదిరి ఉంటాయి. జలుబు చేస్తే ఆవిరి పట్టడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చిన్నపిల్లలపై ఉంటుంది. రెగ్యులర్‌గా వచ్చే వ్యాధులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే తీసుకోవాలి.
ప్రత్యేకంగా ఎలాంటి మెడిసిన్ లేవు. దీనికి వ్యాక్సిన్స్‌కు ఇంకా లేవు. ఈ వైరస్ సోకిన పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. దగ్గు, జలుబు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాంటి జాగ్రత్తలు పాటించాలి. చికిత్స అనేది ప్రధానంగా రోగి లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గేందుకు హైడ్రేషన్ కలిగి ఉండాలి. దగ్గు, జలుబు వంటి ఏవైనా ఇతర లక్షణాలు ఉంటే.. యాంటీ అలెర్జిక్ మందులు తీసుకోవచ్చు.
ఈ వైరస్ నివారణకు తీసుకోవాల్సిన నిర్దిష్ట యాంటీ వైరల్ మెడిసిన్ అంటూ ఏది లేదు. యాంటీ బయోటిక్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే ఇది వైరస్ ఇన్ఫెక్షన్ మాత్రమే. వ్యాధి నియంత్రణ అనేది చాలా ముఖ్యమైనది. 2001లో కనుగొన్న హెచ్‌ఎంపీవీ అనేది తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లకు ప్రధాన కారణం.
డాక్టర్ వీ రాజా మనోహర్ ఆచార్యులు,పల్మోనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ
ఇమ్యూనిటీ పెరగాలంటే!
రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటో న్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణలో విటమిన్ ఎ దోహదపడుతుంది. ఇ, బీటా కెరోటిన్, సి, బి విటమిన్లు, జింక్, సెలీనియంలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పోషకాలూ సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలి. ఆయా సీజన్లలో లభించే పండ్లను, తాజా కూరగాయలు, తృణధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి.
కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి. తరచూ నీళ్లు తాగుతుండాలి. ధూమపానం, మద్యపానం వల్ల రోగనిరోధక శక్తి బాగా తగ్గుతుంది. ఆ అలవాట్లు ఉన్నవారికి అంటువ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని మానుకోవాలి.
డాక్టర్ ఎంఎన్ లక్ష్మీకాంత్ రెడ్డి, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, మెడికవర్ హాస్పిటల్, హైదరాబాద్