04-02-2025 12:00:00 AM
నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
చాలామందికి ఓ అపోహ, భయం ఉన్నది. క్యాన్సర్ వస్తే మరణం తప్పదనే ఆలోచన నరనరాల్లో పాతుకుపోయింది. సైంటిఫికల్‌గా ఇది పూర్తిగా అబద్ధం. ఇంత టెక్నాలజీ, సైన్స్ అభివృద్ధి చెందినా ఎందుకు ఈ భయాలు ఇలాగే ఉండిపోయాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. క్యాన్సర్ వస్తే భయపడాల్సిన పనిలేదు. దానిపై అవగాహన కలిగి ఉండి.. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు.
క్యాన్సర్‌ను జయించాలంటే మూడు కచ్చితంగా కావాలి. మొదటిది ఆత్మవి శ్వాసం, రెండు కుటుంబం, స్నేహితుల సపోర్టు. మూడు వైద్యం. వైద్యం ఎలాగూ మేలు చేస్తుంది. కాని కూడగట్టుకోవాల్సింది మొదటి రెండింటినే. వైద్యం చాలా ఆధునికం అయింది. భయపడాల్సిన క్కర్లేదు. అయితే దాదాపు ఏడాదికి 9.6 మిలియన్ల మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. 2030 నాటికి మరణాల సంఖ్య 13.2 మిలియన్లకు పెరుగుతుందని ఓ అంచనా.
క్యాన్సర్ అనేది శరీరంలోని సాధారణ కణాల సమూహంలో మార్పుల వల్ల అనియంత్రిత, అసాధారణ పెరుగుదలకు దారితీసినప్పుడు సంభవించే ఒక వ్యాధి. లుకేమియా మినహా అన్ని క్యా న్సర్ల విషయంలో ఇది జరుగుతున్నది. చికిత్స చేయకుండా వదిలేస్తే కణితులు పెరుగుతాయి. సాధారణ కణజాలం నుంచి ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. జీర్ణ, నాడీ, ప్రసరణ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ఇలా జీవిద్దాం..
ఆహారంలో మూడింట రెండువంతులు శాకాహారం ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మిటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, కారం, బేకింగ్ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఒత్తిడి కారణంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు తినాలని అనిపించడం, స్వీట్లు, ఉప్పు, కారం ఎక్కువ తినడం జరుగుతుంది. అదే విధంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యం కాదు. ఇది క్యాన్సర్ కు కారణమయ్యే అంశం.
మంచి నిద్ర ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. నాణ్యమైన నిద్ర శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, డిప్రెషన్ వంటి సమస్యలు జయించాలంటే ఏడు గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర పనితీరు దెబ్బతింటే రొమ్ము, పెద్ద ప్రేగు, ప్రోస్టేట్, అండాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్లు తొందరగా వస్తాయి.
ప్రతిరోజూ అరగంట పాటూ క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గడానికి, శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి ఆరోగ్యంగా ఉండటానికి, మెదడు పనితీరుకు సహకరించే ఎండార్ఫిన్ల విడుదలకు అనువుగా ఉంటుంది. పాజిటివ్‌గా ఆలోచించడానికి, ఉల్లాసంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది.
మద్యపానం, ధూమపానం వ్యసనంగా మారి క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.