calender_icon.png 20 November, 2024 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిచేద్దాం ఇలా..!

17-11-2024 12:00:00 AM

ప్రతీ అల కూడా కల కంటుంది..ఎలాగైనా గట్టును తాకి గెలవాలని. ఆ ప్రయత్నం లో అది ఎన్ని సార్లు ఓడిపోతుందో సముద్రానికి, గట్టుకు మాత్రమే తెలుసు. కానీ మనకు అది తాకినప్పుడు మాత్రమే విజేతగా కనిపిస్తుంది. ఓటమి నుండి గెలుపు వైపునకు ప్రయాణం చాలా కష్టం. ఓటమికి భయపడితే అక్కడే ఆగిపోతారు. ఓటమిని విశ్లేషించి తప్పొలు గుర్తించాలి. మరో ప్రయత్నంలో విజయాన్ని పొందాలి.

ఏ రంగంలో అయినా విజయానికి ముందు ఓటమిని చవిచూసిన వారే ఎక్కువగా ఉంటారు. ఎక్కడో ఒకరో ఇద్దరో తప్ప. ప్రతి వారికి విజయమనేది అరచేతిలో పండు లాంటిది కాదు. దానికి ఎంతో కఠోర సాధన అవసరం. విజయం కావాలంటే కొన్ని వదులుకోవాలి.. కొన్ని వదిలించుకోవాలి, కొన్ని నింపుకోవాలి. సమయపాలన, సాధన  ఏ రంగంలోనైనా విజయాన్ని ఇచ్చే గొప్ప లక్షణాలు. విజయానికి ఓటమి అనేది దగ్గర బంధువు.

ఎప్పుడూ విజయం వెనకాలే తిరుగుతూ ఉంటుంది.  విజయం సాధించాలంటే ముందుకు పరిగెత్తాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదని అంటారు. ఆగితే ఓటమి ముందుకెళ్తుంది. ఓటమిఅనేది ఒక ప్రత్యేక పదార్థం ఏమీ కాదు, యదార్ధం. కొందరు ఓటమిని చూసి కృంగి కృశించిపోతారు. కొందరు మాత్రమే ఓటమిని చూసి చలించక నేలకు కొట్టిన రబ్బరుబంతిలా లేచి విజయ శిఖరాల అధిరోహిస్తారు. నిజమైన విజేత ఓడిపోయిన కారణం తనే అనుకుని పరిశీలన చేసుకొని పునర్నిర్మించుకుంటాడు.

విజేతగా నిలుస్తాడు. పరాజితుడు తన ఓటమికి  సాకులను వెతుక్కుంటూ  ఉండిపోతాడు. గెలుపునకు మరో మూల సూత్రం సమయపాలన. లక్ష్యం సాధించే దిశలో మనకు ఎన్నో అవరోధాలు, ఆటంకాలు  వస్తాయి. ఇవి సహజం. వాటిలోకూడా అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు పోయే వాడే అసలైన విజేత. అడ్డంకులు వచ్చాయని ఆగిపోతే, చేస్తున్న పని అర్ధం కాలేదని ఆపేస్తే అది విజేత లక్షణం కాదు. అడ్డంకులను ఎలా తొలగించాలి.

ఏ విధంగా తొలగించాలో ఆలోచించాలి. చేస్తున్న పనిలో అర్థాన్ని ఎలా వెతుక్కోవాలి, అసలు మనకి పని అర్థం అయిందా అనేది ముందుగా ఏ రంగంలో అయినా విశ్లేషించి లోతుగా ఆలోచించాలి. తేడా మనలో ఉందా, లేదా పనిలో ఉందా అని తెలుసుకునే వాడే అసలైన విజేత. 

-శ్రిష్టి శేషగిరి