calender_icon.png 14 October, 2024 | 6:54 AM

గోవును మాతగా చూసే వారికే ఓటేద్దాం

14-10-2024 04:07:02 AM

గోవును పశువులా భావించే వారికి మద్దతు ఇవ్వొద్దు..

జ్యోతిర్మఠ్ పీఠాధిపతి అవిముక్తేశ్వారనంద సరస్వతి

పాండిచ్చేరి, త్రివేండ్రంలో స్వామీజీ గోధ్వజ స్థాపన

తిరువనంతపురం, అక్టోబర్ 13: గోవును పశువులా కాకుండా మాతగా చూసే నేతలకే ఓటేద్దామని, గోమాతను రాష్ట్రమాత చేసేందుకు మద్దతు ఇచ్చే పార్టీలకే అధికారాన్ని కట్టబెడదామని ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్ పీఠాధిపతి అవిముక్తేశ్వారనంద సరస్వతి పిలుపునిచ్చారు.

స్వామీజీ శనివారం ఉదయం తమిళనాడు రాజధాని చైన్నైకి చేరుకున్నారు. అక్కడి పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాండిచ్చేరి చేరుకున్నారు. తొలుత శిష్యగణంతో కలిసి గోధ్వజ స్థాపన చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ గోవును మాతగా భావించాలని, పశువుగా భావించే వారు సంస్కార హీనులన్నారు.

కానీ, వారి సంఖ్య దేశవ్యాప్తంగా చాలా తక్కువగా ఉందన్నారు. గోవును మాతగా భావించే వారే దేశంలో ఎక్కువ మంది ఉన్నారన్నారు. వారు ఓటేస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయన్నారు. కానీ, గోమాతను రాష్ట్రమాత చేయాలనే డిమాండ్‌ను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

గో మాతను రాష్ట్రమాత చేయాలని సంకల్పించే పార్టీలకే భక్తులు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గోవును పశువుగా భావించే పార్టీలు, గోహత్యలను అడ్డుకోని పార్టీలను ఎన్నికల్లో గెలిపించొద్దని సూచించారు. అలా చేస్తే భక్తులకు ఆ పాపం అంటుకుంటుందన్నారు. అలాగే అదివారం స్వామీజీ కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు.

అక్కడి శృంగేరీ మఠంలో గోధ్వజ స్థాపన చేసి భక్తులకు అనుగ్రహ ప్రవచనమిచ్చారు. పూర్వీకులు గోవును ఎంతో పవిత్రంగా భావించే వారని, అదే సంస్కృతి మళ్లీ తీసుకురావాల్సిన అసవరం ఉందన్నారు. గోవును రాష్ట్రమాతగా ప్రకటించేంత వరకు హిందువులు విశ్రమించొద్దని పిలుపునిచ్చారు.