వృద్ధాప్యానికి అర్థం మార్చేస్తున్నారు ఈతరం సీనియర్స్. రిటైర్‌మెంట్ తర్వాత ఇంటికే పరిమితం కాకుండా తమకు ఇష్టమైన కలలను నేరవేర్చుకుంటున్నారు. దేశవిదేశాలను చుట్టేస్తూ సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ‘సాహసం చేయరా డింభకా’ అంటూ లేటు వయసులోనూ పారాగ్లుడింగ్, స్విమ్మింగ్ లాంటివి చేస్తూ ఆకాశ అంచులను తాకేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ట్రావెల్ స్టార్టప్స్ సీనియర్ సిటిజన్స్ ఊహలకు రెక్కలు తొడుగుతున్నాయి.
హర్యానాకు చెందిన దీపు, రాహుల్ గుప్తా.. 55, అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులను ప్రపంచ పర్యటనలు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. వృద్ధాప్య ఛాయలు పొగొట్టేందుకు టూరిజంవైపు అడుగులు వేయిస్తున్నారు. కేవలం సీనియర్ సిటిజన్స్ కోసమే ట్రావెల్ స్టార్టప్ ప్రారంభించి, పర్యటనలకు తీసుకెళ్తున్నారు. 2015లో స్థాపించబడిన ట్రావెల్ స్టార్టప్ ఇప్పటివరకు 5,000 మందికిపైగా సేవలు అందించింది. “ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతుండటంతో పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండలేక పోతున్నారు. అందుకే ట్రావెల్ స్టార్టప్ స్టార్ట్ చేశాం” అన్నారు దీపు.
ఇప్పటివరకు ఈ స్టార్టప్ ద్వారా యునైటెడ్ స్టేట్స్, శ్రీలంక, భూటాన్, వియత్నాం, థాయ్‌లాండ్, సింగపూర్, కెన్యా, దుబాయ్, ఆస్ట్రేలియా, రాజస్థాన్, కేరళ, లడఖ్‌తో సహ 20 దేశాలను చుట్టేశారు. పరమజీత్ అనే మహిళ పదవీ విరమణ తర్వాత 70 ఏళ్ల వయస్సులో దాదాపు 27 దేశాలను సందర్శించారు. “కొత్త ప్రదేశాలు గొప్ప ఉత్సాహాన్నిస్తున్నాయి.
చాలా పర్యటనల్లో సాహసోపేతమైన పనులను చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే నచ్చిన దేశానికి తిరిగి మళ్లీ వెళ్లగలమో లేదో మాకు తెలియదు. కొత్త దేశాల సంస్కృతులను అన్వేషించడం, ఆయా దేశాల చరిత్రను అర్థం చేసుకోవడం, విదేశస్తుల అనుభవా లను తెలుసుకోవడం లాంటివి ఉత్సాహన్నిచ్చాయి” అని అంటున్నారు.
అమృత్‌సర్‌కు చెందిన మహిళ గురుగ్రామ్‌లో తన భర్తతో కలిసి నివసిస్తుంది. అయితే ఆమె జీవితకాలంలో దాచుకున్న డబ్బుతో ఒంటరిగా దేశాల ను అన్వేషిస్తోంది. “నేను ఎవరిపైనా ఆధారపడను. నేను పొదుపు చేసినదంతా నాకోసమే ఖర్చు చేస్తున్నా. నా డబ్బు ఎవరి కోసం ఎందుకు ఖర్చుపెట్టాలి.
సోలో జర్నీచేస్తూనే.. ఇలాంటి స్టార్టప్ సాయంతో ప్రపంచ పర్యటనలు చేస్తున్నా” అని అంటోంది. అలాగే “మేం మంచు పర్వతాల్లో, బీచ్‌లో ఆడుకుంటాం. ఈ ప్రయాణాల్లో అందరం పిల్లలమ వుతాం. నేను చాలామంది తెలియని వ్యక్తులను కలిశాను. వారంతా రూమ్‌మేట్స్‌గా మారారు. జీవితకాల స్నేహితులుగా మిగిలిపోయారు”అని అన్నారు ఓ రిటైర్డ్ టీచర్.
ట్రావెల్ సంస్థలు సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు నిర్వహిస్తుండటంతో చాలామంది పర్యటనలు చేయడా నికి ముందుకొస్తున్నారు. ఈక్రమంలో సాహస క్రీడల్లోనూ పాల్గొంటున్నారు. అలాగే ఆర్ట్, డాన్స్, సింగింగ్, టెక్నాలజీ లాంటి మరెన్నో కొత్త విషయాలను నేర్చుకుంటారు.
ఈ రంగంలో ఉండటం సామాజికంగా ప్రభావం చూపుతోంది. అందుకే తరుచుగా ప్రయాణాలు చేస్తున్నామని చెబుతున్నారు వీళ్లంతా. ‘ప్రయాణం అనేది వృద్ధులకు చాలా దగ్గరగా ఉంటుంది. పదవీ విరమణ చేసినవారు చాలామంది వివిధ బాధ్యతలతో బిజీగా ఉంటున్నారు. అలాంటివారు పర్యాటక ప్రదేశాలు చూసే అవకాశం ఉండదు. కొంతమందికి కావాల్సిన డబ్బు, సమయం ఉన్నా.. ప్రయాణించే అవకాశం ఉండదు. అందుకే ట్రావెల్ కంపెనీలు అందిస్తున్న ప్యాకేజీలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.