calender_icon.png 12 March, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభలో నిలదీద్దాం

12-03-2025 01:19:38 AM

  1. ప్రజా సమస్యలపై గళమెత్తాలి.. 
  2. బీఆర్‌ఎస్‌పై చేస్తున్న తప్పుడు నిందలనూ తిప్పికొట్టాలి
  3. ఎండిన పంటలు, అందని కరెంటు, నీటి కొరతపై ప్రశ్నించాలి
  4. బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం

* రాష్ర్టంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమౌతున్న తీరుపై అసెంబ్లీలో మాట్లాడాలి. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. మహిళలకి చ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని  కొట్లాడాలి.

 కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్‌రావు మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అనుస రించాల్సిన వ్యూహాలను పార్టీ నేతలకు ఆయన సూచించారు. ప్రభుత్వం ఇచ్చి న హామీలు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, ప్రజా సమస్యలపై తనతోపాటు అందరూ గళమెత్తాల ని సూచించారు. పార్టీ శాసనసభ, మం డలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి సభకు హాజరు కావాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని, రాష్ర్ట ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని తెలిపారు. బీఆర్‌ఎస్‌పై రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పికొట్టాలన్నారు. రాష్ర్టంలో నెలకొన్న పలు సమస్యలు.. ఎండిన పంటలు, అందని కరెం టు, సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెం బ్లీ, మండలిలో దూకుడుగా పోరాడాలని నేతలను సూచించారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని పేర్కొన్నారు. రాష్ర్టంలో గురుకుల పాఠశా లలు నిర్వీర్యమౌతున్న తీరుపై మాట్లాడాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పేర్కొన్నారు. మహిళలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని  కొట్లాడా లని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఆరు గ్యారంటీలపై..

ఆరు గ్యారంటీల అమలులో ప్రభు త్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్‌లు విడుదల చేయకపోవడంపై అందరూ మాట్లాడాలని నేతలకు తెలిపారు. వైద్య రంగంలో దిగజారుతున్న ప్రమాణాలు, దళిత బంధును నిలిపివేయడంపట్ల, గొర్రెల పెంపకం, చేపల పంపిణీ, తదితర ప్రజాసమస్యలపై ఎండగట్టాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ర్ట ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్‌ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు. దీంతోపాటు సభల్లో ఇంకా ప్రతిభావంతంగా ప్రజాసమస్యల మీద పోరాడేందుకు సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.

దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ముఖ్య నాయకులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు తాను కూడా వస్తున్నానని పార్టీ ప్రతినిధులతో కేసీఆర్ అన్నారు.