calender_icon.png 2 October, 2024 | 1:47 PM

ప్రభుత్వానికి అండగా ఉందాం

02-10-2024 01:36:30 AM

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

ప్రతిపక్షాలకు దీటుగా సమాధానమివ్వాలి 

కార్పొరేషన్ చైర్మన్లకు పీసీసీ అధ్యక్షుడి సూచన

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విష ప్రచా రం చేస్తున్నాయని, దానిని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు బలంగా తిప్పికొట్టాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భు తంగా పనిచేసిన కార్యకర్తలు, అధికారంలోకి రాగానే విశ్రాంతి తీసుకొంటున్నట్లు కనిపిస్తున్నదని..

బద్దకాన్ని వదిలి ప్రభుత్వ పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోజుకు ౧8 గంటల పాటు విశ్రాంతి లేకుండా పని చేస్తూ రోజు కో కొత్త పథకం తీసుకొచ్చి ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారని, కానీ ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తూ గందర గోళం సృష్టిస్తున్నాయని అన్నారు.

కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకుని ప్రచారం చేయాలని సూచించారు. కార్పొరేషన్ల చైర్మన్లతో మహేష్ కుమార్‌గౌడ్ మంగళవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ తన సోష ల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు.

ప్రభు త్వ పథకాలతో పాటు కార్పొరేషన్ల కార్యక్రమాలపై పూర్తి అవగాహన పెంచుకుని, ప్రతిపక్షాల ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని, అందుకు ప్రధాన మీడియాతోపాటు పార్టీ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకోవాలని సూచించారు.

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500లకు వంటగ్యాస్ సిలిండర్, 30 వేల ఉద్యోగాల కల్పన, కొత్తగా డీఎస్సీతో 11 వేల ఉద్యోగాలు, క్రీడా, నైపుణ్య వర్సిటీలు, రూ.80 వేల కోట్ల పెట్టుబడులతో పాటు అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, వీటన్నింటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.  

ఇంకా చాలామందికి పదవులు 

కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల కంటే ముందే 43 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేశామని, దేశంలోనే డిజిటల్ మెంబర్‌షిప్‌లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పీసీసీ చీఫ్ తెలిపారు. 43 లక్షల క్రియాశీల కార్యకర్తల్లో 40 మందికి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవులు దక్కాయని, ఇంకా చాలా మందికి పదవులు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పార్టీ కోసం కష్టపడిన డీసీసీ అధ్యక్షులు, పలువురు సీనియర్లకు కార్పొరేషన్ పదవులు ఇవ్వడంతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పార్టీకి అభినందనలు  తెలుపుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ కోసం మరింత కష్టపడుతూనే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లు తామని వెల్లడించారు.