బయటకు వెళ్లిన ప్రతిసారి మేకప్ వేసుకోవడం కుదరదు.. అలాగే తరచూ మేకప్ వేసుకోవడం కొందరికి నచ్చకపోవచ్చు. అయినా మేకప్ వేసుకున్నట్లుగా లుక్‌ని సొంతం చేసుకోవాలంటే.. ఈ చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు.
మేకప్ డీటాక్స్‌లో భాగంగా ముందుగా చర్మ సంరక్షణను పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బయటికి వెళ్లడానికి 15 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ లోషన్‌ను రాసుకోవాలి. ఇది ఎండ నుంచి చర్మానికి రక్షణ కల్పించడమే కాదు. చర్మానికి ఒక రకమైన మెరుపును తీసుకొస్తుంది.
డల్‌గా ఉన్న ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చాలంటే టింటెడ్ (ఫౌండేషన్ కంటే లేత రంగు) మాయిశ్చరైజర్‌ను వాడాలి. ఇక ప్రత్యేక సందర్భాల్లో మాత్రం హై కవరేజ్ ఫౌండేషన్స్‌ను వాడితే ఫలితం ఉంటుంది. అయితే ఏది ఎంచుకున్నా చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవడం ముఖ్యం.
చర్మంపై మృత కణాలు ఏర్పడటం, పొలుసులుగా ఊడిపోవడం వల్ల ముఖం డల్‌గా కనిపిస్తుంది. దీనికి ఎక్స్‌ఫోలియేషన్ పద్ధతి మంచి పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ చర్మంతత్వాన్ని బట్టి స్క్రబ్‌ను ఎంచుకొని లేదంటే ఇంట్లోనే సహజ స్క్రబ్‌లను తయారుచేసుకొని వారానికి రెండు మూడుసార్లు స్క్రబింగ్ చేసుకోవాలి. దీనివల్ల చర్మం లోలోపలి నుంచి శుభ్రపడి సహజసిద్ధమైన మెరుపు వస్తుంది.
మేకప్ వేసుకోకపోయినా ఆ మెరుపును పొందాలంటే ముఖం శుభ్రం చేసుకున్నాక టోనర్ వాడమంటున్నారు నిపుణులు. దీనివల్ల ముఖంపై పీహెచ్ స్థాయులు బ్యాలన్స్ అయి చర్మం తాజాగా కనిపిస్తుంది.
పెదాలు మృదువుగా ఉన్నప్పుడే వాటి అందం ఇనుమడిస్తుంది. ఇందుకోసం రోజూ లిప్‌బామ్ రాసుకోవడం తప్పనిసరి. అలాగే ఆలివ్ ఆయిల్ వంటి నూనెలతో పెదాలపై మర్దన చేసుకోవడం వల్ల వాటికి సహజ మెరుపు వస్తుంది. ఫలితంగా లిప్‌స్టిక్ రాసుకునే అవసరమే ఉండదంటున్నారు నిపుణులు.