06-04-2025 12:00:00 AM
వృద్ధులు.. అందరూ ఉన్నా ఒంటరివారుగా మిగిలిపోతున్నారు. కుమారులు, కుమార్తెల విద్యాబుద్ధులు, ఉద్యోగాలు, పెళ్లిళ్ల కోసం తమ జీవితాన్ని ధారబోసినా మలిదశలో కనీన ఆత్మీయతకు నోచుకోలేకపోతున్నారు. దీని ఫలితంగానే వృద్ధాశ్రమాల అవసరం ఏర్పడుతున్నది. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యం శాపం కాదు.. వరం అనేలా వారికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉంది.
యాంత్రిక జీవనంలో ప్రేమానుబంధాలు దూరం కావడంతో వృద్ధులు ఒంటరితనంతో తీవ్ర అనారోగ్యానికి, మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారికి ఆప్యాయత పంచాలి. కాలక్షేపం కోసం పిల్లలతో గడిపేలా చూడాలి. ఒత్తిడి లేకుండా ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.
వృద్ధులకు అండగా..
* వృద్ధాప్యంలో ఉన్నవారు వారి కుటుంబసభ్యుల నుంచి కోరుకునేది కాసింత ప్రేమ.. కొంచెం ఆత్మీయత. అలాంటి తల్లిదండ్రుల పోషణను విస్మరిస్తే చట్టం ఊరుకోదు. వృద్ధులకూ ఎన్నో హక్కులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.
* వృద్ధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం 2007లో కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం తీసుకొచ్చింది. దీని అమలు చేయడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.
* సీనియర్ సిటిజన్స్ మెయింట్‌నెన్స్ చట్టం ప్రకారం వృద్ధులకు రక్షణతో పాటు నెలసరి జీవనభృతి అందించాలి. దీనికి ఆర్డీవో మెజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తారు. బాధిత తల్లిదండ్రులు ఆ అధికారికి ఫిర్యాదు చేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది.
* క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ప్రకారం 1973 సెక్షన్ 125 సీఆర్‌పీసీ ప్రకారం సంతానం తమను నిర్లక్ష్యం చేస్తుందని భావిస్తే తల్లిదండ్రులు వారిపై కేసు వేయొచ్చు.