calender_icon.png 31 January, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్బిటం జలపాతం చూద్దాం రండి

29-01-2025 12:00:00 AM

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలంలోని సబ్బిటం గ్రామానికి దక్షిణ దిశలో వున్న గుట్టల్లో ఆగ్నేయంగా ఈ వర్షాలవల్ల జలపాతం పుట్టింది. 10యేండ్లుగా కనిపించని జలపాతం మళ్ళీ కనిపించడంతో ప్రజలు ప్రతిరోజు సంతోషంగా జలపాతాన్ని చూడ్డానికి వెళ్ళుతు న్నారు. 40 అడుగుల ఎత్తునుండి రెండుపాయలుగా కిందికి దూకుతున్న ఈ జలపాతం ఎంతో సుందరంగా వుంది. జలపాతం కింద ఒక గుండం వుంది.

చాలా లోతుగా వుంటుందని స్థానికులు చెప్పారు. ఈ జలపాతానికి రెండు దిక్కుల్లో వున్న ఆకుపచ్చనిచెట్ల పచ్చదనం, జేగురురంగు రాతిబండలు, తెల్లని నీరు త్రివర్ణాలు అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. జలపాతానికి ఎడమవైపున గుట్టలో తొలిచిన గుహాలయం వుంది.

ఈ గుహాలయంలో కుడివైపున మొదటి గుహలో రాతిగొడపై చెక్కిన అర్ధ శిల్పాల్లో ఆసనస్థితిలో షణ్ముఖుడు, ముడిచిన జటాఝూటంతో ఆసనస్థితిలో నమస్కారముద్రతో శివుడు, (కాయోత్సర్గభంగిమ) స్థానకస్థితిలో కుడిచేతిలో గదతో గణపతి కనిపిస్తున్నారు.

వీటికి ఎడమవైపున వున్న రాతి గోడలపై చెక్కినట్లు ఉలిగుర్తులు కనిపిస్తున్నాయి. రెండవ (మధ్య) గుహాలయం మధ్య లింగాన్ని అమర్చే రంధ్రం వంటిది వుంది. తాత్కాలికంగా దానిలో రాతిముక్క పెట్టివుంది. మూడవ గుహాలయం ఖాళీగావుంది.

వీటికి ఎదురుగా బయట విష్ణుమూర్తి, శివలింగం, నంది, సూర్యుడు, దుర్గ, నాగదేవతల నల్లరాతి శిల్పాలు కొత్తగా కట్టిన వేదికమీద ప్రతిష్టించి వున్నాయి. అయితే గుహాలయాల స్తంభాలపై చెక్కిన డిజైన్లు బౌద్ధ ఆరామస్తంభాలవలె కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రాకృతిక వాతావరణం బహుశః బౌద్ధులనాకర్షించడం వల్ల ఇక్కడ వాళ్ళు ‘వస్సావాసం (వర్షాకాలంలో నివసించే తాత్కాలిక నివాసం)’ ఏర్పాటు చేసుకున్నట్లుగా తోస్తున్నది.

ఇంకా లోతైన పరిశోధన చేయవలసివుంది. ఈ బౌద్ధారామాన్ని తర్వాతి కాలంలో కాపాలికులు వంటివారు ఆక్రమించి తమ మత ప్రతీకలను చెక్కివుండవచ్చు. ఎందుకంటే మొదటి గుహలోని మూడు విగ్రహాలలో మధ్యనున్న శివరూపం యొక్క ముడిచిన జటాఝూటం కాపాలికులకున్నట్లుగా వుంది. జలపాతానికి కుడివైపున కొంచెం ముందుకు గట్టుమీద మరొక దేవాలయం ఆనవాళ్ళుగా విగ్రహాలు కనిపించాయి.

అష్టభుజ మహిషాసురమర్దని, అపురూప ద్విభుజవినాయకుడు (రాష్ట్రకూటులకాలం?), సప్తమాతృకల శిల్పపట్టిక, నాగశిల, శివలింగం, నంది (చివరి రెండు కొత్తవిగా వున్నాయి) విగ్రహాలున్నాయి. మహిషాసురమర్దని, సప్తమాతృకల శిల్పాలు చాళుక్యుల శిల్పశైలిలో వున్నాయి. మిగతావి తర్వాత కాలాల్లో చెక్కబడ్డవనిపిస్తున్నాయి.

ఆ పరిసరాల్లో పడివున్న రాళ్ళు, రాతి పలకలు అక్కడొక గుడి వుండేదని సూచిస్తున్నాయి. సబ్బిటం అనే గ్రామనామం ఒకప్పుడు ఇక్కడవుండే ‘సబ్బి మండలం-1000’ను గుర్తుకు తెస్తున్నది.