calender_icon.png 26 November, 2024 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

26-11-2024 09:51:21 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత భారత దేశ ప్రజలుగా మనందరి మీద వుందని  ప్రిన్సిపల్ జూనియర్ జడ్జీ పాలడుగుల ఆలేఖ్య అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంల సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. భారతదేశంలో వున్న ప్రజలందరి మధ్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం సాధించడం కోసం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని దాదాపు మూడు సంవత్సరాల పాటు కష్టపడి రాసారన్నారు.

బడుగు బలహీన వర్గాల ప్రజలకు మహిళలకు దళితులకు వికలాంగులకు ఉచిత న్యాయ సేవలను అందించడం కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం తీసుకురాబడిందని ఆ చట్టం అమలుకి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆమె పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నవంబర్ 26 తేదీని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అందరికి దక్కేలా న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు భారత రాజ్యాంగం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం గురించి వివరంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొదటి అడిషనల్ కోర్టు మేజిస్ట్రేట్ పద్మ సాయి శ్రీ, రెండవ అడిషనల్ మేజిస్ట్రేట్ జి.స్వాతి, ఏజిపి గుర్రం శ్రీనివాస్ గౌడ్, బార్ అసోసియేషన్ కార్యదర్శి మట్టెలతిరుపతి తో పాటు పలువురు న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.