- కులగణనలో పాల్గొంటే పథకాలు కోల్పోరు
- బీఆర్‌ఎస్ నేతల గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు
- కవిత మాదిరే కేసీఆర్, కేటీఆర్ సర్వేలో పాల్గొనాలి
- మంత్రి పొంగులేటి
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ౨౦౧౪లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేను తాము బయట పెడ్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వేపై బీఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచా రం చేస్తోందని మండిపడ్డారు.
సర్వేలో వివరాలను నమోదు చేసుకుంటే ఎవరూ పథకాలను కోల్పోరని చెప్పారు. సోమవారం సచివాల యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. సర్వే అంతా బోగస్ అంటూ బీఆర్‌ఎస్ ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వారి ఉనికి ప్రశ్నార్థకమైందన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు.
రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని విరుచుకు పడ్డారు. ఒక రోగికి ఎక్స్‌రే ఎలా ఉపయోగపడుతుందో, తెలంగాణలో ఉన్న అంతరాలను తెలుసుకోవడానికి ఈ సర్వే అలాగే సాయపడుతుందని పేర్కొన్నారు. ఈ సర్వే ఆధారంగా ప్రతి కుటుంబం, గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో అంతరాలను తొలగిస్తామని వివరించారు.
ఈ నెలాఖరులోగా కులగణన ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టంచేశారు. తెలంగాణలో చేస్తున్న కులగణన దేశానికి మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు. సర్వే మరింత మెరుగ్గా చేసేందుకు మేధావులు కూడా సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల ఆస్తులు గుర్తించడానికే నాడు సర్వే
ప్రజల ఆస్తులను గుర్తించడానికే నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన సర్వే ఉపయోగపడిం దని పొంగులేటి ఫైర్ అయ్యారు. ఒక్కరోజులో సర్వే చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం చేసిన సర్వేను ఎందుకు బటయపెట్టలేదని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా వెల్లడించలేదని స్పష్టంచేశారు. ఏ తప్పు చేస్తే బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఇంటికి పంపారో.. మళ్లీ అవే తప్పులను చేస్తున్నారని చెప్పారు.
ఒకవైపు సర్వేను సమర్థించకపోగా.. మరోవైపు ప్రజలను తప్పుదోవపట్టించడం తగదన్నారు. కోర్టు పరిధికి లోబడి తాము సర్వే వివరాలను వెల్లడిస్తామని ఉద్ఘాటించారు. లగచర్లలో రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ నాయకులు అధికారులపై దాడులు చేయడాన్ని మంత్రి తప్పుబట్టారు.
ఎమ్మెల్సీ కవితకు అభినందనలు
రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సర్వేలో పాల్గొన్నారని మంత్రి పొంగులేటి చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సర్వేలో భాగంగా వివరాలను నమోదు చేసుకోవడంపై అభినందనలు తెలిపారు. అలాగే కేసీఆర్, కేటీఆర్ కూడా సర్వేలో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో ఆదివారం నాటికి 67,72,240 ఇళ్ల సర్వే పూర్తయ్యిందన్నారు. అత్యధికంగా ములుగులో 87.1శాతం ఇళ్ల సర్వే పూర్తయినట్టు వెల్లడించారు.