calender_icon.png 16 October, 2024 | 5:47 PM

రుణభారం తగ్గించుకుందాం!

16-10-2024 02:33:57 AM

దీర్ఘకాలిక రుణాలవైపు ప్రభుత్వం మొగ్గు

వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రణాళిక

నీటిపారుదల శాఖలో రుణాలపై మంత్రి సమీక్ష

ఏఐఐ బ్యాంక్ ప్రతినిధులతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): నీటిపారుదల శాఖ పరిధిలో ప్రస్తుతమున్న స్వల్పకాలిక రుణాల కారణంగా రాష్ట్ర ఖజానాపై పెను భారం పడుతోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక రుణాలతో నీటిపారుదల రంగాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

స్వల్పకాలిక రుణాలతో దీర్ఘకాలిక రుణాలను పోల్చిచూసినప్పుడు చెల్లించే ఈఎంఐలు, వడ్డీ మొత్తంలపై వెసులుబాటు లభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలికక రుణాలవైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. 

ఏఐఐ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి భేటీ

మంగళవారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ నీటిపారు దల శాఖకు ప్రస్తుతం ఉన్న స్వల్పకాలిక రుణాలను  దీర్ఘకాలిక రుణాలుగా మార్చితే ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడంతోపాటు వడ్డీ చెల్లింపుల్లోకూడా వెసులుబాటు ఉంటుందన్నారు.

తద్వా రా పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి కొత్త ఆయకట్టును సృష్టించేందుకు మార్గం సుగ మం అవుతుందన్నారు. ఈ క్రమంలోనే ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు కూడా ఈ రుణాలను వర్తింపజేయాలని బ్యాంక్ ప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ సూచించారు.

వెనుకబడిన ప్రాంతాలతోపాటు గిరిజనులు అత్యధికంగా ఉన్న ములుగు జిల్లా, ఫ్లోరోసిస్ బారినపడిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఈ రుణాలు వినియోగించేలా చూడా లని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు డిండిలతోపాటు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలు, అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణాలు వినియోగిస్తే తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడుతుందని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తంచేశారు.

సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి

ఇదిలా ఉండగా.. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధుల కు సమావేశం ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అదే సమయంలో అన్ని ప్రాజెక్టులకు పాలనాపరమైన అనుమతులు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

భేటీలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేకకార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఈఎన్‌సీలు అనిల్‌కుమార్, నాగేందర్‌రావు, డిప్యూటీ ఈఎన్‌సీ శ్రీనివాస్‌తో పాటు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ప్రతినిధులు సంగ్మాకిమ్, రాజేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు