21-02-2025 12:00:00 AM
సుస్థిర అభివృద్ధి కోసం 2015లో ‘యునైటెడ్ నేషన్స్’ ఆమోదించిన ‘2030 అజెండా’ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఇందులో పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు సమాజానికి సరైన సమాచారం అందించాల్సిన అవసరం ఉంది.
అందుకు లైబ్రరీలు కీలక భూమిక వహిస్తున్నాయి. అవి సమాచార ప్రాప్తిని సమానంగా అందించడంతోపాటు నిరక్షరాస్యతను తొలగించేందుకు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు, డిజిటల్ లిటరసీ పెంచేందుకు సహాయపడుతున్నాయి. లైబ్రరీలు అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందించే వేదికలు. విద్యార్థుల కోసం అవి డిజిటల్ క్లాసులు, కోచింగ్ సెంటర్లుగా మారి, విద్యలో నాణ్యతను పెంచేందుకు తోడ్పడుతున్నాయి.
వ్యవసాయ సమాచారాన్ని అందించే అగ్రికల్చరల్ లైబ్రరీలు రైతులకు కొత్త పరిశోధనలు, మార్కెట్ సమాచారం, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను నేర్పుతున్నాయి. అలాగే, ఆరోగ్యంపై అవగాహన కల్పించే లైబ్రరీలు, ప్రజలకు సురక్షితమైన నీరు, శుభ్రత, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల్లో ఉపయుక్తమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. లైబ్రరీలు మహిళా సాధికారతకు కూడా దోహదపడుతున్నాయి.
ఇక్కడ మహిళలకు ఆర్థిక స్వావలంబనలో శిక్షణ, కోడింగ్ క్లబ్బులు, స్టార్టప్‌లపై అవగాహన వంటి అవకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగావకా శాల కోసం సమాచార ప్రాప్తి, ఉద్యోగ కోచింగ్, ఆన్‌లైన్ అప్లికేషన్ల సదుపాయాలను గ్రంథాలయాలు అందిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు స్వయంఉపాధి మార్గాలను సూచిస్తూ కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలోనూ ఇవి గణనీయ పాత్ర పోషిస్తున్నాయి.
వాతావరణ మార్పు తాలూకు పరిశోధన లు, ప్రభావంపై ప్రజలకు అవగాహన, సహజ వనరుల సంరక్షణ లో భాగంగా ప్రభుత్వాలను చైతన్య పర్చటం వంటి బాధ్యతలను పరోక్షంగా నిర్వహిస్తున్నాయి. సమానత్వాన్ని పెంపొందించేందుకు, సామాజిక న్యాయాన్ని సాధించేందుకు, సమాచార స్వేచ్ఛను నిర్ధారించేందుకు లైబ్రరీలను ప్రధాన వేదికలుగా భావించాలి.
సమాజంలో పరివర్తన తీసుకురావడానికి, పేదరికాన్ని తగ్గించడానికి, విద్యను అందరికీ చేరవేయడానికి, పరిశోధనలు, ఆవిష్కరణ లను ప్రోత్సహించడానికి మార్గదర్శకంగానూ మారుతున్నాయి. ఈ జ్ఞాన సౌధాలను మరింతగా ఉపయోగించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది.
డా. రాధికారాణి, వరంగల్