సంక్రాంతి అంటే ముగ్గులు, హరిదాసులు, పతంగులు, పిండి వంటలు, కోడి పందేలు, కొత్త సినిమాలు మాత్రమే కాదు.. బొమ్మల కొలువు కూడా. అందుకే సంక్రాంతి సంబరాల్లో బొమ్మల కొలువులు కూడా భాగమవుతోంది. అయితే తెలుగువారి తొలి పండుగ సందర్భంగా ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి చుట్టుపక్కలవారిని ఆహ్వానించే ఆనవాయితీ క్రమంగా కనుమరుగవుతోంది. కాబట్టి ఈ పండుగకైనా బొమ్మల కొలువు సంప్రదాయాన్ని ఘనంగా చాటండి.
సంతానభాగ్యం కోసం, పాడిపంటల కోసం, సుఖమయ కుటుంబజీవనం కోసం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. ఈ పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ఇళ్ళ ముందు రకరకాల రంగవల్లికలను తీర్చిదిద్దుతూ అమ్మాయిలు సంబురాల్లో మునిగి తేలుతారు. అలాగే భోగిరోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. అదే సమయంలో చేసే మరో ఉత్సవం బొమ్మల కొలువు.
బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ అలంకరించేయడం కాదు.. వాటిని పేర్చేందుకు ఓ పద్ధతి ఉంటుంది. సాధారణంగా బొమ్మలను మూడు, ఐదు, తొమ్మిది వరుసలలో పేరుస్తారు. ఈ కొలువు పేర్చేముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడి దశావతారాల సూత్రాల ప్రకారం సృష్టి పరిణామ క్రమం, మానవుడి అభివృద్ధి క్రమం దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రమాణాల్లో బొమ్మలు అమరుస్తారు.
మొదటి మెట్టు: చిన్న చిన్న ఇళ్ల బొమ్మలు, గుడులు, గోపురాలు, పొలాలు, చెట్లు, పూలతీగలు, ప్రకృతితో నిండిన బొమ్మలు పేర్చాలి
రెండో మెట్టు: చేపలు, తాబేలు, నత్త, పీత, శంఖం సహా జలచరాలన్నీ ఈ మెట్టుపై పెట్టొచ్చు
మూడు, నాలుగు మెట్లు: మూడు, నాలుగు మెట్లపై క్రిమికీటకాలు, భ్రమరాలకు సంబంధించిన బొమ్మలు
ఐదో మెట్టు: ఐదో మెట్టుపై జంతువులు, పక్షులకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి
ఆరో మెట్టు: ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి
ఏడో మెట్టు: ఏడో మెట్టుపై మహనీయుల బొమ్మలు పెట్టాలి
ఎనిమిదో మెట్టు: అష్టదిక్పాలకులు, నవగ్రహనాయకులు, పంచభూతాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి
తొమ్మిదో మెట్టు: అన్నిటి కన్నా ఉన్నతమైన తొమ్మిదో మెట్టుపై త్రిమూర్తులు, లక్ష్మీ,సరస్వతి, పార్వతి బొమ్మలతో అలంకరించాలి.