షాపింగ్ కాంప్లెక్స్‌లు.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. కాలేజీలు... స్కూళ్లు.. చివరకు బెడ్రూమ్స్.. ప్లేస్ ఏదైనా సరే.. తెలియకుండానే మూడో కన్ను (స్పై కెమెరా) వెంటాడుతోంది. అర్ధనగ్న దృశ్యాలను రికార్డ్ చేస్తూ మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఓయో హోటల్లో జరిగిన ఘటన కానీ, ఏపీలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో జరిగిన ఘటన కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. స్పై కెమెరాలతో మంచి కంటే చెడు ఎక్కువ. ఈ నేపథ్యంలో మూడో కన్నుపై కన్నెర చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేవరకు భయపడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. కానీ నాలుగు గోడల మధ్యే రక్షణ లేకుండాపోతోంది. ప్రస్తుతం ఇంట్లోకానీ, బయటకానీ మహిళలు సురక్షితంగా ఉండలేని పరిస్థితులు. అందుకు కారణం స్పై కెమెరాల రూపంలో కొందరు వ్యక్తులు చేస్తున్న వికృత చేష్టలే. ఈ నేపథ్యంలో ఆడపిల్లలు, మహిళలు వ్యక్తిగత సమాచారం. వారి గోప్యతకు భద్రత, భరోసా కరువైనట్టు స్పష్టమవుతుంది. స్పై కెమెరాల వల్ల ఇబ్బందులకు గురవుతున్న బాధితులు, వారి కుటుంబసభ్యులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు.
తక్కువ ధరకే..
మహిళల వీడియోలను చిత్రీకరించడానికి ముఖ్య కారణం.. మార్కెట్‌లో స్పై కెమెరాలు అతి తక్కువ ధరకు దొరకడమే అందుకు ప్రధాన కారణం. కేవలం రూ.300లకే స్పై కెమెరాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఎవరైనా వీటిని అక్రమంగా కొనుగోలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. దీనికి తోడు ఆన్‌లైన్‌లో స్పై కెమెరాల అమ్మకాలు జరుగుతున్నాయి. అమెజాన్ వంటి యాప్‌లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. స్పై కెమెరాలు మార్కెట్‌లో ఇంత చౌకగా లభిస్తున్నా.. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు ఎందుకు ఈ విషయంపై దృష్టి సారించడం లేదని బాధితమహిళల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడంతో ఈ నేరాలకు పాల్పడేవారు మరింత పేట్రేగిపోతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చెడే ఎక్కువగా..
వాస్తవానికి స్పై కెమెరాలను వాడకంలోకి తీసుకొచ్చిన ఉద్దేశ్యం మంచిదైనా.. కానీ కొందరు కేటుగాళ్ల ప్రమేయంతో స్పై కెమెరాలను చెడుదారిలో వినియోగిస్తున్నారు. నేరాల నియంత్రణ, పనుల పర్యవేక్షణ, రక్షణ వంటి అంశాల్లో స్పై కెమెరాలను ఉపయోగించాలి. కానీ షాపింగ్ మాల్స్, వాష్‌రూమ్స్, హోటల్ రూమ్స్ వంటి ప్రదేశాల్లో అమర్చి స్పై కెమెరాల లక్ష్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ రకమైన చర్యలతో అమాయక మహిళలు బలవుతున్నారు. బయటకు చెప్పుకోలేని వేదనను అనుభవిస్తున్నారు.
నిఘాతోనే చెక్
స్పై కెమెరాల ద్వారా ఎక్కువ ఘటనలు హోటల్స్, హాస్టల్స్, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లోనే జరుగుతున్నాయి. అయితే హోటల్స్, హాస్టల్లో దాదాపు పనిచేసే వారందరూ పురుషులే ఉంటున్నారు. దీంతో ఈ రకమైన నేరాలు జరగడానికి మరింత ఆస్కారం ఉంటుంది. అందుకే హోటల్స్, హాస్టళ్ల నిర్వాహణపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నేరస్థులను శిక్షించడంలో జాప్యం కారణంగా మరిన్నీ జరగడానికి ప్రేరేపించినట్టు అవుతుంది.
ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు శిక్షణ...
తెలంగాణ ప్రభుత్వం స్పై కెమెరాల వాడకంతో జరుగుతున్న నష్టాలను అరికట్టేందుకు ముందడుగు వేసింది. భారతదేశంలోనే మొదటిసారి ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు స్పై కెమెరాలను గుర్తించడంపై అవగాహన కల్పిస్తుంది. మొదటి విడతగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉన్న 231 పోలీసు స్టేషన్‌ల ఆధ్వర్యంలో 300 కాలేజీ నుంచి 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. రెండో విడతలో తెలంగాణ రాష్ట్రం మొత్తం విస్తరించనున్నారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణ మహిళల భద్రత విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే శిక్షణ పొందిన 300 మంది ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు స్పై కెమెరాలను గుర్తించే బగ్ డిటెక్టర్లను, ఇతర మెటిరీయల్‌ను ఇచ్చారు. అయినప్పటికీ స్పై కెమెరాల వికృత చేష్టలు, ఆగడాలు మాత్రం ఆగడం లేదు.
క్రాంతి మల్లాడి
ఇవి గుర్తించాలి
- హోటళ్లు, షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు వాష్‌రూమ్స్ వాడే సమయంలో జాగ్రత్తలు తప్పరిస రి. పరిసరాలను నిశితంగా గమనించాలి.
- ట్రయల్ రూమ్స్, హోటల్ గదులు, స్విచ్‌బోర్డు లు, ఫ్యాన్లు, బల్బు, హోల్డర్లు, పూల కుండీలు, అలంకరణ వస్తువులు, గోడ గడియారాలు, టేబుల్ ల్యాంప్‌లు, ఫొటో ఫ్రేములు.. ఇలా అన్ని స్రై కెమెరాలు దాచేందుకు అనువైన ప్రదేశాలే. వాటిని నిశితంగా పరిశీలించాలి. ఏవైనా చిన్న రంధ్రాలు ఉన్నట్టు గుర్తిస్తే అక్కడ సీక్రెట్ కెమెరా ఉన్నట్టు అనుమానించాలి.
- హిడెన్ కెమెరా కనిపిస్తే కంగారు పడకుండా పోలీసులకు సమాచారం అందించాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో తాకరాదు. అలా తాకడం వల్ల వాటిపైన ఉన్న నిందితుడి వేలిముద్రలు పోతా యి. ఆధారాల కోసం వాటి ఫొటోలను తీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి.
- స్రై కెమెరాలు పెట్టిన ప్రదేశం నుంచి ఇతరులకు ఫోన్‌కాల్ చేస్తే కాల్ డ్రాప్ అవుతుంది. స్పై కెమెరాల్లో ఉండే మ్యాగ్నటిక్ తరంగాల వల్ల ఇలా జరుగుతుంది.
- వాష్‌రూమ్స్ ఉపయోగించే ముందు వాటిలో ఉండే అద్దాలను క్షుణ్ణంగా గమనించాలి. అద్దం మీద మన వేలు ఉంచితే.. అద్దానికి వేలికి మధ్య కొంత ఖాళీ ఉన్నట్టు గుర్తిస్తే అది సేఫ్. అద్దంలోని మన వేలి ప్రతిబింబంతో వేలు టచ్ అయితే అది ప్రమాదకరమైన పారదర్శకమైన గ్లాస్ అని గుర్తించాలి.
- మొబైల్ ఫ్లాష్‌తో కూడా గుర్తించవచ్చు. ముందుగా ఆ గదిలో లైట్లు ఆపాలి. చీకటి గదిలో మన మొబైల్ కెమెరా ఫ్లాష్‌ను ఆన్‌చేసి గదిలోని అన్ని ప్రాంతాల్లో వేస్తూ చెక్ చేయాలి. అక్కడ చిన్న స్పై కెమెరా ఉన్నా దాని లెన్స్‌పై ఫోన్ ఫ్లాష్ పడితే వెంటనే మెరుస్తుంది.
- స్మార్ట్‌ఫోన్‌లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని కూడా కెమెరాలను కనిపెట్టవచ్చు. అయితే ఈ యాప్‌ల ద్వారా ఫోన్‌లోకి వైరస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
ఏం చేయాలంటే..
- మహిళల రక్షణ కోసం మండల స్థాయిలో కేంద్రాలు ఏర్పాటుచేయాలి.
- ప్రైవేటు, పబ్లిక్ రంగాల్లో పనిచేస్తున్న మహిళల కోసం ఇంటర్నల్ కమిటీ, లోకల్ కంప్లుంట్ కమిటీలను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని నిర్వహించాలి.
- దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న స్పై కెమెరాల అమ్మకాలను క్రమబద్దీకరించాలి.
- ఒక మహిళకు సంబంధించిన అభ్యంతరకరమై న ఫొటోలు, వీడియోలు తీయడం లేదా షేర్ చేయడం తీవ్రమైన నేరాలుగా పరిగణలోకి తీసుకోవాలి.
- వ్యాపార సంస్థలు కూడా తమ వద్దకు వచ్చే మ హిళా కస్టమర్ల భద్రత తమ సొంత బాధ్యతగా తీసుకోవాలి. వ్యాపార సంస్థల్లో, హోటల్స్, మాల్స్, హాస్టల్స్ మొదలైన ప్రాంతాల్లో తమ సిబ్బంది కానీ, ఎవరైనా ఇతరులు స్పైకెమెరాలు బిగించడంపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలి. దీనికి సంబంధించిన చట్టాల్లో మార్పులు చేసి కఠినంగా అమలు చేయాలి.
ప్రత్యేక చట్టం అమలుచేయాలి
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ స్పై కెమెరాల విక్రమాలపై నియంత్రణ లేకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీని వల్ల ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. అందుకే స్పై కెమెరాల ద్వారా జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించాలి. నేరాలు జరిగిన వెంటనే నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ రకమైన నేరాలను నియంత్రణ కోసమే ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ఉద్యమం చేస్తున్నాను. దీనిపై ప్రజల్లో కూడా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. స్పై కెమెరాలను గుర్తించేందుకు మార్కెట్‌లో బగ్ డిటెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిఒక్కరూ వాటిని వినియోగించాలి. ఈ విషయంపై అవగాహన కోసం ప్రభుత్వం కూడా సరైన బడ్జెట్ కేటాయించాలి.
జీ.వరలక్ష్మీ,
హెవెన్ హోమ్స్ సొసైటీ ఫౌండర్, ప్రెసిడెంట్