వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు)తో బాధపడటం సర్వసాధారణంగా మారింది. జీవనశైలినో, ఇతర కారణాలో.. కానీ ఆర్థరైటిస్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు కూర్చోలేక, నిల్చోలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలో కీళ్లనొప్పులు ఎందుకు వస్తాయి? వాటివల్ల కలిగే అనర్థాలేంటీ? వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పద్ధతులు, అందుబాటులో ఉన్న చికిత్స విధానాలు గురించి వివరంగా తెలుసుకుందాం...
మీ కుటుంబంలో ఎవరికైనా ఆర్థరైటిస్ ఉంటే జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థరైటిస్ వ్యాధులకు పూర్తిస్థాయి చికిత్స లేదు. ప్రారంభ దశలో గుర్తిస్తే నియంత్రణలో ఉంచవచ్చు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెబుతున్న ప్రకారం కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
అంటే కీళ్లకు అతిగా పని చెప్పడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. అలాగే వయస్సురీత్యా కూడా ఆర్థరైటిస్ బారినపడే అవకాశం ఎక్కువ. యాభై ఏళ్లు దాటినవారు ఆర్థరైటిస్ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. మహిళల్లోనూ ఈ సమస్య వేధిస్తోంది.
అలాగే అధిక బరువుతో బాధపడేవారు కూడా కీళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఆధునిక యుగంలో కీళ్ల మార్పిడికి రోబోటిక్ సర్జరీ వచ్చిందని, దీని వల్ల కూడా చక్కని ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
-చలికాలంలో జాగ్రత్త
చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలతో పాటుగా కీళ్ల నొప్పులు కూడా వస్తుంటాయి. కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు సాధారణంగా వృద్ధులు లేదా అథ్లెట్లు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ.. కొంతమందికి చలికాలంలో మాత్రమే కీళ్ల నొప్పులు వస్తాయి. ఈ నొప్పి ఎక్కువగా వాతావరణంలోని మార్పు వల్లే వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ ఉష్ణోగ్రత కండరాల నొప్పులకు దారితీస్తుంది. ఫలితంగా కీళ్ల నొప్పులొస్తున్నాయి. దీనికి తోడు ఈ సీజన్‌లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా కీళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది. బయట చల్లగా ఉన్నప్పుడు కూడా కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి.
కాలి, వేళ్లు, ఇతర భాగాలకు రక్తం సరిగ్గా అందదు. ఈ కీళ్ల నొప్పులు మరీ ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్‌కు వెళ్లాలి. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా దీనివల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఇది మీ శరీర భాగాలను బాగా కదిలిస్తుంది కూడా. చలిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే నొప్పిని దూరం చేయడానికి బాగా సహాయపడుతుంది. వ్యాయామం చేయడానికి ముందు వార్మప్ తప్పకుండా చేయాలి.
వయసుపైబడ్డవారిలో
ప్రస్తుతం 40 నుంచి 60 ఏళ్లు పైబడినవారు కీళ్లనొప్పులతో అధికంగా బాధపడుతున్నారు. వయసు పెరిగాక ఆర్థరైటిస్ వస్తే మాత్రం మందులు వాడక తప్పదు. శరీరంలో సైనోబియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది కీళ్ళను కదిపేందుకు అవసరమైన పోషకం. వృద్ధాప్యం వల్ల ఈ సైనోబియల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది.
దీనివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువైపోతాయి. ఎప్పుడైతే కీళ్ల మధ్య ఉన్న ఈ సైనోబియల్ ఫ్లూయిడ్ తగ్గుతుందో కీళ్ళు ఒకదానికొకటి రాసుకుని తీవ్ర ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారికోసం కొన్ని రకాల సప్లిమెంట్లను వైద్యులు సూచిస్తారు.
వృద్ధాప్యం కారణంగా వచ్చే ఆర్థరైటిస్‌ను అడ్డుకోవడం కష్టమే, కానీ వయసులో ఉన్నప్పుడే కీళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే బరువును తగ్గించుకోవాలి. పోషకాహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఈ మూడు త్వరగా ఆర్థరైటిస్ బారిన పడకుండా అడ్డుకుంటుంది.
పిల్లల్లోనూ..
సాధారణంగా కీళ్లనొప్పులు పెద్ద వయసువారిలోనే వస్తుంటాయి. మనదేశంలో ప్రతి వెయ్యిమంది పిల్లల్లో ఒకరు ఈ వ్యాధికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే చిన్నపిల్లల్లో కూడా కీళ్ల వాపు, నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. పదహారేళ్లలోపు పిల్లల్లో కనిపించే కీళ్ల వాపు, నొప్పులు లాంటి లక్షణాలతో కూడిన వ్యాధిని ‘జువెనైల్ ఆర్థరైటిస్’ అంటారు.
దీనికి గురైనవారిలో కీళ్లలో విపరీతమైన నొప్పి, అసాధారణ పెరుగుదలలు, కీళ్లు తమ సాధారణ రూపం లో లేకపోవటం లాంటి సమస్యలు ఉంటాయి. సరైన సమయంలో సమస్యని గుర్తించిప్పుడు వైద్యులు మ రింత సమర్ధవంతంగా చికిత్సని అందించగలరు.
మం దులు, శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో జువెనైల్ ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవ చ్చు. పిల్లలకు కీళ్లవ్యాధి ఉన్నట్టుగా తేలితే తల్లిదండ్రులు చికిత్స విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏం చేయాలంటే..
శారీరకంగా చురుకుగా: ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రెగ్యులర్ వ్యాయామం అవసరం. క్రమం తప్పకుండా వ్యాయమాలు చేయడం వల్ల శరీరం చురుగ్గా మారి కండరాల్లో కదలికలు ఏర్పడుతాయి. దాంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి వీలైనంతవరకు తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి.
సమతుల్య ఆహారం: తృణధాన్యాలు, ప్రొటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. బరువు నిర్వహణకు, మధుమేహాన్ని నిరోధించడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పదార్థాలు, అధిక సోడియం తగ్గించాలి.
రెగ్యులర్ చెకప్స్: మధుమేహం వంటి సమస్యలతో బాధపడినట్టయితే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు, మందులు తీసుకోవడం, సరైన జీవనశైలి పాటించడం ముఖ్యం.
నిర్లక్ష్యం చేయొద్దు
కీళ్లనొప్పులను నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని పట్టించుకోకపోతే సమస్య ప్రధాన అవయవాలపైనా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే కొందరిలో చర్మవ్యాధులు, రక్తకణాలు తగ్గిపోవడం జరుగుతుంది. మరికొందరిలో కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
నరాల సమస్యలు కూడా తలెత్తవచ్చు. గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. పురుషుల్లో అయితే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సమస్యలు వస్తాయి. హెచ్‌ఎల్‌ఏ బి-27 జీన్ వల్ల పురుషుల్లో దీని రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
అందుకని కీళ్లనొప్పులు బాధిస్తున్నప్పుడు ప్రత్యేక చికిత్స విధానాలు తెలిసిన రుమటాలజిస్టును సంప్రదించడం ఉత్తమం. అయితే శరీరంలోనే పుట్టిన రుగ్మతనుబట్టి చాలా రకాలుంటాయి. కాబట్టి మీరు ఏసమస్యతో బాధపడుతున్నారో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి.
కొన్ని లక్షణాలు
- నొప్పి
- వాపు
- వైకల్యం
- తిమ్మిరి
- కీళ్ళు గట్టిగా మారడం
- శరీరం కదిలించే సామర్థ్యం లేకపోవడం
- కీలు చుట్టూ చర్మం ఎర్రగా మారడం
- గంటల తరబడి కూర్చోవడం
సకాలంలో స్పందించాలి
ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్‌లో పలు రకాలున్నాయి. ఇందులో ఎక్కువగా ఆస్టియోపొరోసిస్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఆస్టియోపొరోసిస్‌తో బాధపడేవారిలో ఎమముకల త్వరగా బలహీనమవుతాయి. ఏదైనా చిన్నగాయామైతే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది స్లుంట్ డిసీజ్.. బోన్ క్వాలిటీ తగ్గడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతా యి. అలాగే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి సకాలంలో స్పందించి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.
డాక్టర్ రాహుల్ రెడ్డి
ఎంబీబీఎస్,
ఎంఎస్ ఆర్థోపెడిక్,
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్,
ప్రాణహిత హాస్పిటల్,
చైతన్యపురి, హైదరాబాద్