- ధాన్యం కొనుగోలు అయ్యాక గంటల్లోపే బోనస్ జమ
- డిసెంబర్ 4లోపు వందశాతం ధాన్యం డబ్బులు చెల్లించాలి
- రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి
- ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- శ్రీధర్‌బాబు, పొన్నంతో కలిసి సమీక్ష
- ‘పత్తిపాక’తో 2.4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ : మంత్రి శ్రీధర్‌బాబు
పెద్దపల్లి, డిసెంబర్ 1 (విజయక్రాంతి): రైతు లు పండించే సన్న వడ్లను ప్రైవేటు వ్యా పారుల చేతికి పోనివ్వబోమని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ వ్యాపారులకు అమ్మినా రూ. ౨,౮౦౦ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రభుత్వం తరఫున కనీసం ౩౬ లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో ని సమావేశ మందిరంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌తో కలిసి ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోళ్లు, పౌరసరఫరాల విభాగంపై కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తొలుత ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ద్వారా వివరించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వ పనులు, కాళేశ్వరం ప్యాకేజీ 9 పెండింగ్, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టు, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం, రామగుండం ఎత్తిపోతల పథకం, ఎల్లంపల్లి కెనాల్ నెట్‌వర్క్ ప్రాజెక్టు పనులు, ధాన్యం సేకరణ, కస్టం మిల్లింగ్ రైస్ డెలివరీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు పండించారని తెలిపారు. ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని స్పష్టంచేశారు. రైతుల అకౌంట్లలోకి రికార్డు స్థాయిలో వడ్ల డబ్బులు పడుతున్నాయని చెప్పారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన గంటల వ్యవధిలో రైతులక ధాన్యం డబ్బులతోపాటు బోనస్ చెల్లిస్తామని ఉద్ఘాటించారు.
డిసెంబర్ 4న సీఎం పర్యటన సమయానికి వంద శాతం ధాన్యం డబ్బులు చెల్లించి ఉండాలని అధికారులకు స్పష్టంచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
రోళ్ల వాగు ప్రాజెక్టుకు సంబంధించి అటవీ భూముల సేకరణ ప్రక్రియ నీటి పారదల శాఖ భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన అధికారితో సమన్వయం చేస్తూ పూర్తి చేయాలని సూచించారు. రోళ్ల వాగుపై క్షేత్రస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు.
గౌరవెల్లి ప్రాజెక్టు సంబంధించి భూసేకరణ అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామని కాల్వ పనులు త్వరగా చేపట్టేలా స్థానిక రైతులతో మాట్లాడి కోర్టు కేసు విత్ డ్రా చేయించాలని ప్రజాప్రతినిధులను కోరారు. పత్తిపాక రిజర్వార్ రూ.2,950 కోట్లు 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రాథమిక అంచనాలు తయారు చేశామని వెల్లడించారు.
రామగుండంలో ఎత్తిపోతల పథకం 95 శాతం పూర్తయిందనీ, డిసెంబర్ నెలాఖరు వరకు పెం డింగ్ పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నుంచి రైతులకు సాగునీరు అందించాలని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని ప్యాకేజీ 9 పెండింగ్ పనులు, చిన్న కాళేశ్వరం పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
బోనస్‌తో రైతులకు అధిక లాభం
సన్న వడ్లకు ప్రభుత్వం అందజేస్తున్న రూ.500 బోనస్‌తోనే రైతులకు అధికంగా లాభం చేకూరుతుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రాధాన్యతను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రూ.2 లక్షల రుణమాఫీ, సన్న రకం వడ్లకు బోనస్ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న రైతులకు వీడియోలు రూపొందించి ప్రచారం చేయాలని కోరారు.
చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ త్వరగా చేపట్టాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టుగా సంబంధించి మరిన్ని ఔట్‌లెట్ల నిర్మాణం చేయాలని సూచించారు. పత్తిపాక రిజర్వాయర్‌తో 2.4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు కొత్తగా మరో 15 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని చెప్పారు.
వరదల వల్ల దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేయాలని చెప్పారు. జిల్లాలో ఉన్న చిన్న లిఫ్టుల నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. పోతారం ఎత్తిపోతల పథకం, భీం ఘనపూర్ ఎత్తిపోతల పథకం పనుల ప్రతిపాదనలు అందజేయాలన్నారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే యువశక్తి సభా స్థలిని మంత్రుల బృందం పరిశీలించింది. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం మీడియాకు సీఎం సభ నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టులు, ధాన్యం కొనుగోలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్‌సింగ్, కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్‌కుమార్, సత్యప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ వేణు, జే అరుణశ్రీ, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.