02-04-2025 01:13:52 AM
ఒక్క అంగుళమైనా తీసుకోం!
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : అబద్ధాల మీదనే బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ దుష్ర్పచారం చేస్తున్నాయని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి (హెచ్‌సీయూ) సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రజా ప్రభుత్వం గుంజు కోలేదని మంత్రులు స్పష్టం చేశారు.
ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ర్ట సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి.. తిరిగి ప్రజలకు ఆస్తిగా ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు పట్టించుకోని ఈ భూముల వ్యవహారంపై ఇప్పుడు పనిగట్టుకొని దుష్ర్పచారం చేస్తున్నారని, ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరిం చారు.
ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూమిని వెనక్కి తెచ్చుకోవాలనే ప్రయత్నం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే.. కంచ గచ్చిబౌలి భూములపై స్వాధీనం చేసుకున్నామని భట్టి స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రజా ప్రభుత్వం గుంజు కోలేదు. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు.
ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ర్ట సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి.. తిరిగి ప్రజలకు ఆస్తిగా ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చింది. హెచ్‌సీయూకి కేటాయించిన 534.28 ఎకరాల భూమిని 2004 ఫిబ్రవరి 3న రెవెన్యూ అధికారులకు అప్పగించగా, వారు గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36 లో 191.36 ఎకరాలు సర్వేనెంబర్ 37 లో 205.20 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివ ర్సిటీకి అప్పగించి భూ బదలాయింపు చేసుకున్నారు.
భూ బదలాయింపు జరిగిన తర్వాత అప్పటి ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీ రావు ప్రాతినిథ్యం వహించిన ఐఎంజీ ఫ్లోరిడాకు చెందిన ఐఎం జీ భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థకు కేటాయించారు. ప్రభుత్వం ఒప్పందం మేరకు ఆ భూమిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా కోట్లాది విలువైన 400 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్‌కు కేటాయించడాన్ని రద్దు చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఐఎంజీ భారత్ సవా ల్ చేస్తూ హైకోర్టులో డబ్యూపీ నంబర్ 24781 ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేశా రు. ఐఎంజీ భారత్ వేసిన రిట్ పిటిషన్‌పై అప్పటి ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వపరంగా వాదనలు వినిపించారు’ అని వివరించారు.
భూములను ప్రభుత్వం కాపాడింది..
‘కోట్లాది విలువైన ఈ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోనే ఉంటే మరోరకంగా గత పాలకులు వారి చేతుల్లోకి తెచ్చుకోవాలనే కుట్రతోనే న్యాయస్థానంలో గట్టిగా కొట్లాడలేదు. ఆ భూమి ప్రైవేటు వ్యక్తి చేతుల్లోకి పోనివ్వకుండా ప్రజలకు సంపద సృష్టించే ఆస్తిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మంచి న్యాయవాదులను నియామకం చేశాం. న్యాయస్థానంలో భూమిని రాష్ట్రానికి తీకొచ్చాం. ఇది ప్రజల విజయం.
ప్రైవే ట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడి ప్రజలకు ఆస్తిగా ఇచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని శభాష్ అని ప్రశంసించాల్సిన ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. గత పాలకుల మాదిరిగా ప్రజా ప్రభుత్వం స్పందించకుంటే వేలాది కోట్ల విలువైన 400 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతం అయ్యి ఉండేది కాదా? అని భట్టి విక్రమార్క నిలదీశారు.
‘ప్రైవేటు వ్యక్తి నుంచి తీసుకువచ్చిన భూమిని రాష్ర్ట ప్రజలకు ఆస్తిగా సృష్టించాలని, లక్షల మంది నిరుద్యోగ యువతీ, యు వకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తాపత్రయంతో రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసీకి అప్పగించామే తప్ప ఇందులో ఎవరికీ ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు.
ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్ సిటీలో ఫేస్ 1, ఫేస్ 2కి పునాదులు వేయడం వల్లనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడంతో అనేక ఐటీ సంస్థలు నగరానికి వచ్చి కంపనీలు పెట్టడం వల్ల లక్షల మంది యువతకు ఉద్యోగాలు దొరికాయి. 400 ఎకరాల్లో సంపద సృష్టించడం యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో దాని అభివృద్ధి చేస్తున్నామే తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి స్వార్థం లేదు.
టీజీఐఒసీ తయారు చేసిన డ్రాఫ్ట్ లేఔట్ లో ఈ భూముల్లో ఉన్న న్యాచురల్ రాక్ ఫార్మేషన్స్, దానిలో భాగంగా మషమ్ రాక్‌ను కాపాడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ ప్రాంతాలను లే అవుట్ నుండి మినహాయించాం. పొల్యూషన్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ ఉండాలని పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని భట్టి చెప్పారు. అని భట్టి చెప్పారు.
విద్యార్థుల ముసుగులో బీఆర్‌ఎస్ అరాచకం
మంత్రి పొంగులేటి ఆగ్రహం
హెచ్‌సీయూ భూ అంశంపై రాద్దాంతం చేస్తున్నవారికి హైరైజ్ భవనాలకు అనుమతి ఇచ్చేటప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా? అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల ముసుగులో బీఆర్‌ఎస్ వ్యక్తులు అరాచకం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ భూముల్లోని జంతువులు, పక్షులకు ఎలాంటి హాని జరగలేదన్నారు.
జంతువులు చనిపోయినట్లు సోషల్ మీడియాలో చూపుతున్న చిత్రాలు పాతవని మంత్రి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులేనని చెప్పారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్లోని బండరాళ్లు, చెరువులకు ఎలాంటి నష్టం జరగనీయమని మంత్రి పేర్కొన్నారు.
పనులకు అడ్డుతగిలితే ఎవ్వరినీ వదలం
మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరిక
‘కంచె గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి. బీఆర్‌ఎస్, బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం కావాలనే అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది వారికి తగదు. రాష్ర్ట ప్రగ తిని అడ్డుకునేలా రాజకీయాలు చేయ డం మంచిది కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటికి చెందిన ఒక్క ఇంచు భూమిని కూడా ప్రభు త్వం కబ్జా చేయలేదు.
ఇప్పటివరకు ఒక్క ఎకరం భూమిపై కూడా యూనివర్సిటీకి చట్టబద్ధ హక్కులు లేవు. ఈ సమస్యను పరిష్కరించాలని యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ.. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు పట్టించుకోలే దు. ఇప్పుడేమో పనిగట్టుకొని మాపై దుష్ర్పచారం చేస్తున్నారు.
ఇలాంటి చర్యలను ఉపేక్షించబోం’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మండపడ్డారు. ‘వారం రోజుల కిందట యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ తో మేం ప్రత్యేకంగా సమావేశమయ్యాం. వారి విజ్ఞప్తి మేరకు మా ప్రభు త్వం యూనివర్సిటీకి భూములపై నిబంధనల ప్రకారం చట్టబద్ధ హక్కులు కల్పిం చేందుకు చొరవ తీసుకున్నాం.
అక్కడున్న నేచురల్ రాక్ ఫార్మేషన్స్, సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి వనరులను కనుమరుగు చేస్తున్నామంటూ కొందరూ మాపై దుష్ర్పచారం చేస్తున్నారు. ప్రజలంతా గమనించాలి. వాస్తవం తెలుసుకోవాలి. 2003లో అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మేం అధికారంలోకి వచ్చాకా సరిదిద్దాం. మా పనులకు అడ్డు తగిలితే ఎవ్వరిని వదలం’ అని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు.