calender_icon.png 30 April, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవసరంలేని కాల్వల కోసం మా భూములు ఇయ్యం

30-04-2025 12:29:56 AM

* బలవంతంగా గుంజుకుంటే ఊరుకోం

* ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఐవోసీ బిల్డింగ్ ముందు రైతుల ధర్నా

హుస్నాబాద్, ఏప్రిల్ 29 : గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల కోసం తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేశారు. మంగళవారం హుస్నాబాద్ లోని ఐవోసీ బిల్డింగ్ ముందు మండలంలోని కూచనపల్లి, పందిల్ల గ్రామాల రైతులు ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు.

తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే అవసరం లేని కొత్త కాల్వల తవ్వకంతో తమ జీవనాధారమైన కొద్దిపాటి భూములను కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ గ్రామాల్లో ఉన్న పాత కాల్వల ద్వారానే సాగునీరు అందుతోందని, గౌరవెల్లి ప్రాజెక్టు నీటిని కూడా ఆ కాల్వల ద్వారానే అందించవచ్చన్నారు. కొత్త కాల్వల తవ్వకం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వం ఈ భూసేకరణ సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

‘మాకు రెండు మూడు ఎకరాల భూమి ఉంది. కాల్వల కోసం అది కూడా పోతే మేము ఎలా బతకాలి? బలవంతంగా భూములు గుంజుకుంటే ఊరుకోం‘ అని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, కానీ పేరుకు మాత్రమే కాల్వలు అని చెప్పి ఇష్టానుసారంగా భూములు తీసుకోవడం సరికాదన్నారు.

కూచనపల్లిలో ఇప్పటికే సాగునీటి కోసం పాత కాల్వలు ఉన్నాయని, వాటి ద్వారానే ప్రాజెక్టు నీటిని తరలించాలని ఆయన కోరారు. రైతుల బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని,  మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆయన రైతులతో కలిసి ఆర్డీవో రామ్మూర్తికి వినతిపత్రాన్ని ఇచ్చారు.