- మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం
- ప్రకృతితో మమేకమై జీవించటమే భారతీయ సంస్కృతి
- మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు
- లోక్‌మంథన్‌లో ఆకట్టుకున్న ప్రాచీన సాంస్కృతిక, కళారూపాలు, సంగీత సాధనాలు
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని.. మన కుటుంబ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనదని మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎంత ఉన్నత స్థితికి చేరినా మూలాలను మరువద్దని, మనదైన ధర్మం, సంస్కృతి, సంప్రదాయం, భాషలను ముందు తరాలకు చేరువచేయాలని ఆకాంక్షించారు.
సాంస్కృతిక పునరుజ్జీవం అవసరం ఉందని, తిరిగి మనమందరం మన మూలాలకు వెళ్లాలని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ శిల్పారామంలో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటు లోక్‌మంథన్ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించే కళారూపాలను, ఆదివాసీ కళారూపాలను, ప్రాచీన సంగీత సాధనాలు, ఉపకరణాలను, తాళపత్రాలను, గృహోపకరణాలను ప్రదర్శించగా, ప్రతి విభాగాన్నీ తిలకించి హర్షం వ్యక్తంచేశారు. ఆదివాసీలు, గిరిజనుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు.
అనంతరం ఆయన మాట్లాడారు. ‘మన భాష, మన సంస్కృతి, మన వారసత్వం పట్ల మనమంతా గర్వ పడాలి. వాటిని పాటించడానికి, ముందు తరాలకు అందించడానికి సంకోచం వద్దు. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. మన సంస్కృతి మన విలువైన సంపద. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
ఇక్కడ ప్రదర్శించిన ఆదివాసీల సంగీత సాధనాలు, కళారూపాలను చూస్తుంటే అమితమైన ఆనందం కలుగుతోంది. ఇటువంటి అద్భుతమైన సాధనాలను వదిలి పాశ్చాత్య వ్యామోహంతో గందరగోళ ధ్వనులను సృష్టించే సంగీత సాధనాల వైపు మళ్లడం సరికాదు’ అని అన్నారు.
బ్రిటిష్ వారు వచ్చి మన సంపదను దోచుకువెళ్లడమే కాకుండా కొంత మంది మనసులను కూడా దోచుకెళ్లారని, ఆంగ్లభాషను రుద్ది వెళ్లారని చెప్పారు. దేశంలో అద్భుతమైన భాషలున్నాయని, తొలుత మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తూ ఆ తర్వాత ఆసక్తి ఉన్న ఇతర భారతీయ భాషలు నేర్చుకోవాలని, ఆ తర్వాతే ఆంగ్లమని స్పష్టంచేశారు.
విద్యార్థులకు చిన్ననాటి నుంచే ప్రకృతితో కలిసి జీవించడం అలవాటు చేయాలని, ఉదయాన్నే లేచి యోగా చేయాలని సూచించారు.
రాజకీయాలకు అతీతంగా లోక్‌మంథన్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రాజకీయాలకు అతీతంగా లోక్‌మంథన్ జరుగుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, లోక్‌మంథన్ స్వాగత కమిటీ చైర్మన్ జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఇది భారతీయ సంస్కృతికి సంబంధించిన, దేశానికి ఉపయోగపడే కార్యక్రమమని అన్నారు. లోక్‌మంథన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ కళాకారులు, మేధావులు, ఆర్టిస్టులు, ఆలోచనాపరులు, పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొంటారని తెలిపారు. ఎగ్జిబిషన్ శిల్పారామంలో ఉంటుందని, మంథన్ మాత్రం శిల్పకళా వేదికలో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
శుక్రవారం రాష్ర్టపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని తెలిపారు. ఆరెస్సెస్ సస్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కూడా పాల్గొంటారని, కుటుంబ వ్యవస్థ, దాని ప్రాధాన్యత, సామాజిక సమరసత, స్వదేశీ తదితర అంశాలపై వారు మార్గదర్శనం చేస్తారని తెలిపారు.
ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 24 వరకు జరిగే ఈ ప్రదర్శనను ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తిలకించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో గంగా జమునా తహజీబ్ సంస్కృతి: మంత్రి జూపల్లి
ప్రతి రెండేళ్లకోసారి జరిగే లోక మంథన్ కార్యక్రమానికి దక్షిణాదిలోనే మొదటిసారి హైదరాబాద్ వేదిక కావడం గొప్ప విషయమని.. ఇందులో తెలంగాణ సాంస్కృతిక శాఖ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
విభిన్న మతాలు, భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునా తహజీబ్ సంస్కృతి శతాబ్ధాలుగా విలసిల్లుతోందని చెప్పారు. మన సాంస్కృతిక ఏకత్వాన్ని చాటిచెప్పేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ వృత్తులు, రంగాలకు చెందిన కళాకారుల సాదర స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.
ఇక్కడకు వచ్చిన అతిధులు.. తెలంగాణ వంటకాల రుచిని ఆస్వాదించాలని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో లోక్ మంథన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి, నిర్వాహకులు కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
12 దేశాలు.. 1500 మంది ప్రతినిధులు
హైదరాబాద్ శిల్పారామంలో గురువారం ప్రారంభమైన లోక్‌మంథన్‌కు దేశంతోపాటు 12 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 120 సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ నెల 24 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో నేటి నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చే వారికి ఆహ్వానం ఉచితంగా ఉంటుంది. గురువారం ప్రాచీన వృత్తులు, సంస్కృతికి సంబంధించిన పరికరాలను ప్రదర్శించారు. వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ప్రదర్శనలనిచ్చారు. నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు లోక్‌మంథన్‌లో ఈవెంట్స్‌ను తిలకించేందుకు తరలివచ్చారు.