calender_icon.png 29 December, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన భాష, సంస్కృతిని మరవొద్దు

29-12-2024 02:36:09 AM

* తెలుగును పరిపుష్టం చేసేలా ప్రభుత్వాలు ఆలోచించాలి

* మన వారసత్వాన్ని పిల్లలకూ గుర్తు చేయాలి

* సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

* విజయవాడలో ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం

* తెలంగాణ నుంచి హాజరైన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన భాష, సంస్కృ తిని మరిచిపోకూడదని కోరుకునే వ్యక్తిని తానని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమ ణ స్పష్టం చేశారు. తెలుగుభాష పలుకుబడి వినసొంపైనది. అది సంగీతంలా ఉంటుందని అన్నారు. ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలోని కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో శని వారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

మాతృభాష ను భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన సభలను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 1,500 మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు.

కాగా పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలో మూడు వేదికలను సదస్సులు, సాహిత్య, కవితా సమ్మేళనాల కోసం సిద్ధం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కేబీఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెయ్యికి పైగా దివంగతులైన ప్రముఖ కవుల ముఖచిత్రాలతో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను అతిథులు తిలకించారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు, ప్రచురణ సంస్థల్లో మాతృభాష ప్రాధాన్యంపైనా సదస్సులు ఏర్పాటు చేశారు. 

‘తెలుగు’ అందమైన భాష

“తెలుగు భాషను కాపాడుకుందాం.. ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనే నినాదంతో ఐక్యత చాటేందుకు విజయవాడకు వచ్చిన వారందరికీ వందనాలు” అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. సభా వేదిక నుంచి మిమ్మల్ని చూస్తుంటే తెలుగు ప్రపంచం తన ముందు సాక్షాత్కరిస్తోందన్నారు. సామాన్య ప్రజలు సైతం కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు అని తెలిపారు.

అలాంటి తెలుగును.. వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం వేరే భాష, సంస్కృతి వచ్చి కొల్లగొడితే మనం సహించొద్దని సూచించారు. తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకున్నప్పుడే మనం గొప్పవారమవుతామని తెలిపారు. భాష లేకపోతే చరిత్ర లేని అనాథలం అవుతామన్నారు. శ్రీశ్రీ, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సినారె వంటి గొప్ప కవులు, రచయితలు.. భానుమతి, సూర్యకాంతం, జమున, సావిత్రి, ఘంటసాల, ఎస్వీఆర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఇలా ఎందరో దిగ్గజాల ఘనమైన వారసత్వం మనదని.. ఈ వారసత్వాన్ని మనం గుర్తుంచుకొని.. పిల్లలకూ గుర్తు చేయాలని సూచించారు.

ఎన్టీఆర్ వల్ల తెలుగు భాషకు, ప్రజలకు గౌరవం పెరిగిందని గుర్తు చేశారు. తెలుగును పరిపుష్టం చేసేలా ప్రభుత్వాలు ఆలోచించాలని.. పత్రికలు, చానళ్లు తెలుగు అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. తెలుగుకు మద్దతిచ్చేవారికే ఓటేస్తామని ప్రజలతో చెప్పించాలని.. అలా చేస్తేనే మాతృభాష అభివృద్ధి, వైభవం దక్కుతుందన్నారు. మహాసభల్లో ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధ ప్రసాద్, విశ్వహిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న, సినీ గేయకవి భువనచంద్ర, ఆచార్య కొలకలూరి ఇనాక్ తదితరులు పాల్గొన్నారు.