19-04-2025 12:00:00 AM
స్వయంగా వాల్ పెయింటింగ్ వేసి ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 14 ఏళ్లపాటు శ్రీరాముని వనవాసం స్ఫూర్తితో పోరాడి రాష్ట్రాన్ని సాధించి, అన్నీ రాష్టాలకు తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దరని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ విజయవంతానికై ఆదిలాబాద్ లో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వయం గా పార్టీ జెండా గద్దెకు రంగులు వేస్తూ, గోడలపై ప్రచార వాల్ పెయింటింగ్ లు వేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి వారి అభివృద్ధికి పాటుపడడం జరిగిందన్నారు. ఆంధ్ర సమైక్య పాలనలో తెలంగాణకు నిధులు, నీళ్లు, ఉద్యోగాలు లేక కరువు ఉండేదని, నేడు ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ సుభిక్షంగా విద్యా, వైద్యం, ఉద్యో గం అన్ని రంగాలలో ముందుండేలా కేసీఆర్ ప్యూహాత్మకంగా పాలన సాగించారని గుర్తు చేశారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తుందని యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరాన్ని మరోసారి దెబ్బ తీసే ప్రయత్నంలో కాంగ్రెస్ మోసపూరిత పాలన కొనసాగిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకు లు ఇజ్జగిరి నారాయణ, అజయ్, శ్రీనివా స్, గండ్రత్ రమేష్, సంతోష్, నర్సాగౌడ్, విట్టల్, కుమ్రా రాజు తదితరులు పాల్గొన్నారు.