హైదరాబాద్ సీపీ ఆనంద్
వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కొద్ది రోజులుగా నగరంలో జరుగుతున్న ఘటనలపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దృష్టి సారించారు. ఈ మేరకు మంగళవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఎన్జీవో సంస్థలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలో ఆశ్రయం లేని వ్యక్తులకు సంబంధించిన అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, వీరిలో కొంతమంది మానసిక స్థితి సరిగా లేక మతపరమైన ప్రదేశాల వద్దకు వెళ్తున్నారని, వారిని తనిఖీ చేసి కట్టడి చేయకపోతే భవిష్యత్‌లో నగరంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రిజనర్స్ డీజీపీ డా.సౌమ్య మిశ్రా, అడిషనల్ సీపీ లా ఆండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్, ప్రిజనర్స్ ఐజీపీ ఎం మురళీబాబు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, లేబర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ రమాదేవి, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఐజీపీ వీబీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ సీపీ ట్రాఫిక్ పీ విశ్వప్రసాద్, రోడ్డు సేఫ్టీ ఐజీపీ కే రమేశ్ నాయుడు, రైల్వేస్ డీఐజీ మహ్మద్ శాదాన్ జెబ్‌ఖాన్ పాల్గొన్నారు.