బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి
కురియన్ కమిటీ ముందు ఎంపీ అభ్యర్థుల వివరణ
- ఎంపీలు, ఓడిన అభ్యర్థులతో ఫలితాలపై సమీక్ష
- పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది
- 8 సీట్లకే పరిమితం కావడానికి కారణమేంటి?
- అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా వచ్చిన ఓట్లపై విశ్లేషణ
- ఒక్కో అభ్యర్థితో దాదాపు 30 నిమిషాల వరకు భేటీ
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ఫలితా లపై కాంగ్రెస్ అధిష్ఠానం పోస్ట్‌మార్టం నిర్వహించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ లోక్‌సభ స్థానాలకుగాను.. 14 సీట్ల వరకు గెలుస్తామని పెట్టుకున్న అంచనా తప్పి 8 స్థానాలకే పరిమితం కావడానికి గల కార ణాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలో ఏఐసీసీ నియమించిన త్రీమెన్ కమిటీ గురువారం గాంధీభవన్‌లో మొదటి రోజు ఎంపీలు, ఎన్నికల్లో ఓడిన ఎంపీ అభ్యర్థులతో సమావేశమైంది. ఒక్కో అభ్యర్థికి దాదాపు 30 నిమిషాలవరకు సమయం కేటాయించి గెలవాల్సిన సీట్లలో ఎందుకు ఓడామనే అంశాలపై ఆరా తీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీ సీట్లు రావడం, అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం ఓట్లకే పరిమితమైన బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి గల కారాణాలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు?
నేతల మధ్య సమన్వయం కుదరలేదా? క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సహకరించారా? ఆయా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్‌కు ఇప్పుడు ఎంత శాతం తగ్గింది? క్రాస్ ఓటింగ్ జరిగిందా? ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి? అనే అంశాలపై ఆరా తిసిన కమిటీ.. అభ్యర్థులు చెప్పిన వాటన్నింటినీ నోట్ చేసుకుని ఒక నివేదికను తయారు చేయనున్నది. అయితే మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉన్నా.. ఎందుకు చేజారాయనే అంశాలను కూడా అక్కడ పోటీచేసిన అభ్యర్థులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
కొంపముంచిన కొత్తవారు
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ముఖ్య నాయకులతోపాటు కార్యకర్తలు కూడా కష్టపడి పని చేశారని, అయితే బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీకి క్రాస్ కావడం వల్లే ఓటమి చెందామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులంతా చెప్పినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నుంచి పోటీ చేసిన డీకే అరుణ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో పార్టీ క్యాడర్ కూడా బీజేపీ విజయానికి పాటుపడ్డారనే చర్చ జరిగినట్లు తెలిసింది. కొందరిని ఎన్నికల ముందు పార్టీలోకి తీసుకొని టికెట్లు ఇవ్వడం వల్ల కూడా కొంత నష్టం జరిగిందనేది చర్చకు వచ్చినట్లు సమచారం. మెదక్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసిన అభ్యర్థులు ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు.
వారికి టికెట్ ఇవ్వడం కలిసి రాలేదనే కొందరు నేతలు కమిటీకి చెప్పినట్టు తెలిసింది. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ చివరివరకు అభ్యర్థులను ప్రకటించకపోవడం కూడా నష్టం జరిగిందని అభిప్రాయపడ్డట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కురియన్ కమిటీ ముందు ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, మల్లు రవి, రఘువీర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కడియం కావ్య, సురేష్ షెట్కార్, ఓడిన అభ్యర్థులు దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, నీలం మధు, ఆత్రం సుగుణ ఏఐసీసీ కమిటీతో సమావేశమయ్యారు. త్రీమెన్ కమిటీ శుక్రవారం ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశం కానున్నది. శనివారం డిసీసీ అధ్యక్షులతో సమావేశమై.. ఎన్నికల్లో పార్టీ ఓటమిగల కారణాలపై వివరాలు తెలుసుకోనున్నారు.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎన్నికలు: చామల
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను ప్రజలు పట్టించుకోలేదని, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరిగాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కురియన్ కమిటీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక అవగాహనకు వచ్చి కాంగ్రెస్‌ను రెండో స్థానంలో ఉంచాలనే కుట్ర పన్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దించలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి బదిలీ కావడంతోనే కాంగ్రెస్ 8 స్థానాలకు పరిమితమైందని వివరించారు.
లోపాల దిద్దుబాటుకు మంచి అవకాశం: దానం నాగేందర్
గెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం శుభ పరిణామమని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి పద్ధతి లేదని అన్నారు. ఇది కొత్త విధానమని పేర్కొన్నారు. జరిగిన లోపాలు సరిదిద్దుకోవడానికి మంచి అవకాశమని చెప్పారు. తన ఓటమికి కొన్ని పొరపాట్లు జరిగాయని, వాటిని కురియన్ కమిటీకి తెలియజేశానని తెలిపారు.