calender_icon.png 15 January, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్ఞానదీపాలు వెలిగిద్దాం!

25-10-2024 12:00:00 AM

దీప: పాపహరో నౄణాం దీప ఆపన్నివారక:

దీపో విధత్తే సుకృతిం దీప: సంపత్ ప్రదాయకః॥

వెలుగు, కాంతి, ప్రకాశం, జ్ఞానాదులకు దీపం సంకేతం. ఆధ్యా త్మికమైన లోతుల్లోకి వెళ్తే మనలోని జీవ చైతన్యానికి కూడా దీపమే సంకేతం. ఈ చైతన్యమనే దీపానికి మన మనస్సును జోడిస్తే మనస్సు కూడా కాంతివంతమవుతుంది. లోకాన్ని ప్రత్యేకమైన దృష్టితో జ్ఞానమయంగా చూస్తుంది. జీవితం ఆనందమయమవుతుంది.

అందుకే దీపాన్ని ఉపాసించడం, దీప భావాన్ని మనస్సులో నింపుకోవడం, దీపకాంతికి నమస్కరించడం భారతీయ సంప్రదాయంగా మారింది. అటువంటి దీపాల ను వరుసలో పేర్చుకొని జీవ చైతన్యం తో మమేకమయ్యే పండుగ దీపావళి. మనలో కాంతిని పెంచుకోవాలి. మన మే కాంతిగా మారి లోకానికి వెలుగును ఇవ్వాలనే సందేశాన్నిచ్చేది దీపావళి.

వెలుగును, జ్యోతిని దైవంగా భావించిన సంస్కృతి భారతీయం. క్షీరసాగర మథనం నుండి పుట్టిన మహాలక్ష్మికి దీపావళి నాడు వెలుగు రూపంగా చేసే అర్చన కూడా ఈ కోవకే చెందుతుంది. వెలుగులు భూమిమీద తగ్గబోతున్న సమయంలో వెలుగు, జ్ఞాన రూపమైన లక్ష్మీ ఆరాధన, చీకటి, అజ్ఞాన రూపమైన అలక్ష్మీ నిస్సరణ దీపావళి ప్రత్యేకతలు.

లక్ష్మీ రూప దీపోత్సవం ఈ రోజునుండే ప్రారంభమవుతుంది. ఇంకా కేదార గౌరీ వ్రతాలన్నీ భూమికి చేసే అర్చనలే. భూదేవతా శక్తికి చేసే అర్చన, చెప్పే కృతజ్ఞతలే ఈ వ్రతాలు. దీపావళి సంద ర్భంలోని అన్ని అంశాలు వెలుగుల చుట్టే తిరుగుతాయి. బలి పాడ్యమి, యమ ద్వితీయలూ చీకటి ఈ భూమిని ఇబ్బంది పెట్టకుండా, మన శరీరాలపై వ్యతిరేకతలకు గురి చేయకుండా చేసే ప్రయత్నాలే.

ఆనందాన్నిచ్చే సంపదలు

ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి కేదార గౌరీ వ్రతం, బలిపాడ్యమి, యమద్వితీయ అనే వేర్వేరు కార్యక్రమాల సమన్వయం ఈ దీపావళి ముందు వెనుకల్లో జరిగే పండుగ సంబరాలు. లక్ష్మీదేవి ఆరాధన ధనరూపంలో చేసే విధానం ‘ధన త్రయోదశి’ నాడు జరుగుతుంది. అష్ట లక్ష్మీ రూపాల్లో ధనలక్ష్మీరూపం ప్రత్యేకమైంది. అందరికీ అవసరమైంది కూడా. లక్ష్మీదేవి సంపదకు సంకేతం.

సంపదలు జీవితానికి ఆనందాన్నిచ్చేవి. మనకున్న ఆరోగ్యం, ధైర్యం, ఆనందం, సంతృప్తి, ప్రశాంతత అన్నీకూడా సంపదలే. వీటికి లెక్కలు కట్టడం, రూపాన్నివ్వడం సాధ్యం కాదు. వీటన్నింటి సమాహార రూపమే లక్ష్మీదేవి. వీటినే ధనాలుగా భావించే సంప్ర దాయం భారతీయులది. వైదిక సంప్రదాయంలోనూ మనకు వినియోగపడే ప్రకృతి సముదాయాన్ని ధనంగా భావించారు.

ధనమగ్నిర్ధనం వాయు: ధనం సూర్యో ధనం వసు: 

ధనమింద్రో బృహస్పతిం వరుణం ధనమశ్నుతే॥

అనే శ్రీసూక్త శ్లోకం మనమందరం పఠిస్తున్నదే. అగ్ని, వాయువు, సూర్యు డు, వసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు అందరూ ధనానికి ప్రతీకలు. ఆ ధనాన్ని గుర్తు చేసుకుని ఆరాధించాల్సిన అవసరం ఉంది. అయితే, ఆరాధిం చడానికి వాటికి రూపాలు లేనందున రూప సంపదైన రూపాయలతో కూడిన ‘ధనలక్ష్మీ’ పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్నది. ఆ రోజున రూప సంపద అయిన ధనాన్ని అత్యధికంగా దానం చేసిన వారికి రూపర హితమైన ఆరోగ్య, సంతాన, సంతృప్తులన్నీ పరిపూర్ణంగా లభిస్తుంటాయని శాస్త్రాలు చెప్పాయి. ఇదే ‘ధన త్రయోదశి’ ఉత్సవ అసలు లక్ష్యం.

దీపావళి అమావాస్యనాడు దీప స్వరూపమైన వేడిమిని, వెలుగును ఉపాసించడమే లక్ష్యం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్నట్లుగా చీకటిని వెలుగుల మయం చేసే విధానమే ఈ దీపావళి. మనలోని అజ్ఞాన తిమిరాన్ని విజ్ఞానపు కిరణాలతో మార్చుకునే ప్రయత్నమే దీపాలతో చేసే పూజ.

అందుకే, దీపాన్నికూడా లక్ష్మీదేవితో పోల్చడం. లక్ష్మీదేవి ప్రార్థన అంటే కేవలం ధనానికి చేసే ఆరాధన మాత్రమే కాదు. ఓజోన్ పొర లోపలి ప్రకృతి అంతా మహాలక్ష్మీ స్వరూపమే. ఇందు లో సరైన కాంతి ఉంటేనే సమస్త జీవజాతులకు మనుగడ ఉంటుంది. గృహాన్ని దీపకాంతులతో నింపి అలక్ష్మి(చీకటి లేదా అజ్ఞానం)ని పారద్రోలడమే ఈ పండుగలోని పరమార్థం. 

 సాగి కమలాకర శర్మ