calender_icon.png 11 March, 2025 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాషామతల్లిని బతికించుకుందాం!

20-02-2025 12:00:00 AM

రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

తెలుగుదనమే మనకు ధనమని

తెలుగుభాష చరిత్ర ఘనమని

మాతృభాషను ప్రేమించుమని

పరభాషలను గౌరవించుమని.. 

ఎందరో పెద్దలు, ఎన్నో సందర్భాల్లో మనకు తెలియపరిచారు. అయినా కూడా మనకు పరభాషపట్ల వ్యామోహం తగ్గడం లేదు. మాతృభాష అయిన తెలుగుతోపాటు ఎన్ని భాషాలైన నేర్చుకోవచ్చు. కానీ, నేడు తెలుగు సరిగా రాయడం, చడవడం రాకుండా లేదా నేర్చుకోకుం డా పరభాషకై పరుగులు పెట్టడం బాగా లేదు.

విశ్వవ్యాప్తంగా మన మాతృభాష తెలుగుకు మంచి గుర్తింపు ఉంది. చరిత్రను పరిశీలిస్తే మన భాషా సౌందర్యాన్ని ప్రాచీన, ఆధునిక కవులు ఎంతగానో వర్ణించారు. శ్రీకృష్ణదేవరాయల సూక్తి ‘దేశభాషలం దు తెలుగులెస్స’ నుంచి డా. సినారె మాటలైన ‘ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువ కరువై పోతే అది కంఠశోష’ అన్నంత వరకు..

ఎప్పుడు చూసినా మాతృభాషా మాధుర్యం గురించిన ప్రస్తావనాలు చాలానే ఉన్నాయి. మాతృభాష అనేది సహజంగానే అలవడుతుంది. అప్రయత్నంగానే వచ్చేది మాతృబాష. ఏ భాషను శిశువు అసంకల్పితంగా మాట్లాడతాడో దానినే ‘మాతృభాష’ అంటారు.

మన కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే!

‘ఐక్యరాజ్యసమితి’ (ఐరాస) సాంస్కృతిక విషయాల సంస్థ ‘యునెస్కో’ ఫిబ్రవరి 21ని ‘అంత ర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా 1999 నవంబర్ 17న ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రత్యేకించి ఆ రోజు విశ్వవ్యాప్తంగా వారివారి మాతృభాషను కాపాడుకోవడానికి ప్రత్యే క ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారు.

మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాష. తల్లి ఒడిలో పసిపిల్లలు మాట్లాడే భాషే అది. మాతృ భాష సహజంగా వినడం వల్ల దానంతటదే వస్తుం ది. అమ్మ మాటే మాతృభాష. అవసరాల కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు, నేర్చుకోవాలి కూడా. అయితే, వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. ఆ మేరకు తల్లిభాష ను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడు కోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని ‘యునెస్కో’ చెబుతున్నది. కానీ, నేడు ఎక్కడ చూసినా పరబాషపట్ల ఉన్న ఆసక్తి మాతృభాషపై ఉండడం లేదు. తల్లిదండ్రులు, సమాజం కూడా అశ్రద్ధ చేయడం వల్ల మాతృభాషలు అంతరించి పోనున్నాయి.

బహుభాషలు నేర్చుకోవడం వల్ల ప్రాపంచిక విషయాలపట్ల సులభంగా అవగాహన కలిగి, విశాల దృష్టిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని సాహిత్యాభిలాషులు, విజ్ఞానవేత్తలు ఎన్నోమార్లు ప్రకటించారు. అయితే, మాతృ భాషను కాపాడుకుంటూనే దానిద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొంద డం సరైన మార్గం అని ‘యునెస్కో’ వెల్లడించింది. “తెలుగుభాషను కాపాడుకోవడం మనందరి కర్త వ్యం.

దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు శ్రీకృ ష్ణదేవరాయలు. తెలుగుభాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలామంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో రకరకాల పను ల కోసం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం  సాధారణమైంది. అందువల్ల ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొంది, అందరికీ తప్పనిసరి అయింది. ప్రస్తుత జీవన విధానంలో ఆంగ్లం నేర్చుకోవడం అవసరమే కానీ అదే జీవితంగా ఉండ కూడదు.

ప్రజలు, ప్రభుత్వం ఒక్కటై సాధించాలి

మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, భాషసహా సంస్కృతిని కాపాడుకోవ డం, భావి తరాలవారికి అందించడం మన బాధ్యతగా భావించాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ తమవం తు కృషి చేయాలి. ప్రథమంగా కావలసింది మాతృ భాషాభిమానం. తెలుగు భాషపట్ల పూర్తి అంకితభా వం, అభిమానం పెంపొందించుకొని, దాని మూలాలను తరతరాలకు అందించే ఉమ్మడి ఆస్తిగా భావించి అభివృద్ధి పరచాలి.

ఆ ఇష్టాన్ని ఆచరణలో చూపాలి. లేకపోతే, ‘దేశ భాషలందు తెలుగు లెస్’ (తక్కువ) అవుతుంది. ఇప్పటికైనా, తెలుగు వారందరూ తమ పరిధిలో మాతృభాష పట్ల శ్రద్ధ వహిం చాలి. ఎందరో కవులతోపాటు విదేశీయులూ తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా అభివర్ణించారు. అంత గొప్పది మన భాష. తెలుగు మరి కొన్నాళ్లు బతకాలంటే ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతు అవసరం. 

ప్రభుత్వ వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరిగేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. ప్రభుత్వ ఉత్త ర్వులు, చట్టాలు తెలుగులోనే ఉండాలి. తెలుగును నిజమైన అధికార భాషగా మార్చుకుందాం. ఎంత టి క్లిష్ట విషయమైనా మన భాషలో సులభంగా అర్థం చేసుకోగలం. ఇంగ్లీషులో మాత్రమే ఉన్న పుస్తకాలను తెలుగులోకి అనువదించి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. పత్రికలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంగ్లీష్ పదాలను సాధ్యమైనంత వరకు తగ్గించి, తెలుగులోనే విధిగా రాయాలి. 

 గడప రఘుపతిరావు

9963499282