calender_icon.png 31 October, 2024 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీక్ష చేద్దాం రా!

25-07-2024 01:06:35 AM

  • కేసీఆర్ కూడా ఢిల్లీకి వస్తే నేనూ సిద్ధం

సచ్చుడో.. తెలంగాణకు నిధులు తెచ్చుడో జరగాలి: సీఎం రేవంత్

  1. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికీ వెనకాడను
  2. తెలంగాణకు బడ్జెట్‌లో కేంద్రం అన్యాయం
  3. యూపీ, బీహార్‌కు పెద్ద మొత్తంలో నిధులు
  4. విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదు
  5. కేంద్ర వైఖరి నిరసనగా 27న జరిగే.. నీతి అయోగ్ భేటీని బహిష్కరిస్తున్నాం
  6. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  7. బడ్జెట్‌లో అన్యాయంపై ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద దీక్ష చేయటానికి తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శాసన సభా నాయకుడిగా తాను దీక్షకు కూర్చుంటానని, ప్రతిపక్ష నేతగా బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు కూడా రావాలని డిమాండ్ చేశారు.

అప్పుడు నిధులు తెచ్చుడో మేమిద్దరం చచ్చుడో చూద్దామని సవాల్ విసిరారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంపై సీఎం, మంత్రులతోపాటు బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు కూడా మాట్లాడారు. అనంతరం సభ తీర్మానాన్ని ఆమోదించింది. చర్చ సందర్భంగా అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. 

ప్రజల ప్రాణత్యాగాలపై మేం ఎదగలేదు

చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర మంత్రులంతా ఢిల్లీలో దీక్షలు చేస్తే తాము మద్దతిస్తామని కేటీఆర్ ప్రకటించారు. అప్పుడు రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి నిధులు తెస్తారో.. వారే పదవులకు రాజీనామా చేస్తారో తేల్చుకోవచ్చని అన్నారు. అందుకు స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని మేం ఎప్పుడూ చెప్పలేదు.

రూ. 100 పెట్టి కిరోసిన్ కొని 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె కొనలేకపోయినవారు ఉన్నారు. మేం ఎవరి ప్రాణత్యాగాలపై రాజకీయాలు చేసిన అధికారం సాధించలేదు. ప్రజల మద్దతుతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆగం చేసింది. ఆగమైన తెలంగాణను గాడిలో పెట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని నమ్మి ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చారు. వారి కోసం ఎంతటి త్యాగానికైన సిద్ధం’ సీఎం పేర్కొన్నారు. 

దక్షిణాదిపై కేంద్రానికి చిన్నచూపు

తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి ఒక రూపాయి చెల్లిస్తే తిరిగి కేంద్రం 45 పైసలు కూడా ఇవ్వడంలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పదేళ్లలో కేంద్రానికి దక్షిణాది ఐదు రాష్ట్రాలు రూ.22.24 లక్షల కోట్లకుపైగా పన్నులు రూపంలో చెల్లిస్తే.. కేంద్రం తిరిగి రూ.6. 42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ నుంచి రూ.3.68 లక్షల కోట్లు పన్నులు చెల్లిస్తే తిరిగి ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమేనని విమర్శించారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ కేంద్రానికి రూ.3.41 లక్షల కోట్లు చెల్లిస్తే, కేంద్రం తిరిగి రూ.6.91 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. తాను ఫెడరల్ స్ఫూర్తితోనే ప్రధాని మోదీ మూడుసార్లు కలిసి రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. పెద్దన్న అని పిలిచి ఆ పాత్ర పోషించాలని కోరానని, అయినా మోదీ ఇచ్చిందేమీ లేదని దుయ్యబట్టారు. 

నీతి అయోగ్ భేటీని బహిష్కరిస్తున్నాం

రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము సభలో చర్చ పెట్టి కేంద్రానికి విస్పష్టంగా నిరసన తెలిపాలని నిర్ణయించామని సీఎం వెల్లడించారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తొలి నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో సవరణ చేసిన తెలంగాణకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం ఒక్కటి కూడా నెరవేర్చలేదని సీఎం విమర్శించారు. ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమ ని అడిగాం. హైదరాబాద్, వరంగల్, నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్ మంజూరు చేయాలని కోరాం.  జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాల, ఐఐఎం, ఐఐటీహెచ్ వంటి ఉన్నత విద్యాసంస్థలు ఇవ్వాలని కోరాం. వీటిలో ఒక్కదాన్ని కూడా కేంద్రం పట్టించుకోలేదు’ అని విమర్శించారు. 

తీర్మానానికి ఆమోదం 

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల ప్రదర్శించిన వివక్షను నిరసిస్తూ శాసనసభ తీర్మానం ఆమోదించింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ అనంతరం ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్‌లో సవరణలు చేయాలని శాసనసభ కోరింది. అన్ని రాష్ట్రాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని గుర్తుచేసింది.   

మేనేజ్‌మెంట్ కోటా వర్సెస్ పేమెంట్ కోటా

అసెంబ్లీలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకొన్నారు. కీలకమైన చర్చ జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని, సభకు వస్తే ప్రధాని మోదీ చూస్తారని రాలేదేమోనని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి కేంద్ర బడ్జెట్‌పై చర్చను ప్రతిపాదించగా.. కేటీఆర్ దానిని తీర్మానంగా పొరబడ్డారు. తీర్మానం కాపీ లేకుండా ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. అందుకు స్పందించిన సీఎం.. ఇన్నాళ్లు మేనేంజ్ మెంట్ కోటా అనుకున్నానని, ఇప్పుడు అంతకుమించి దారుణంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు.

కుటుంబం మొత్తం అలాగే ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మా నాయన మమ్మల్ని మంత్రులను చేయలేదు. కష్టపడి కిందిస్థాయి నుంచి ఇక్కడికి వచ్చాం’ అని అన్నారు. అందుకు కేటీఆర్ కూడా దీటుగా బదులిచ్చారు. ‘నాది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రేవంత్‌రెడ్డిది పేమెంట్ కోటా. అయ్యల పేర్లు చెప్పి పదవులు పొందటం గురించి అంటే.. రాహుల్ గాంధీని అంటున్నారా? రాజీవ్ గాంధీని అంటున్నారా? తెలియడం లేదు’ అని చురకలంటించారు. సీఎంకు సమాధానం చెప్పడానికి తాము సరిపోతామని, కేసీఆర్ అవసరం లేదని స్పష్టంచేశారు.

హరీష్‌రావు కోసమే ఆర్టీసీ సంఘాల రద్దు 

బీఆర్‌ఎస్ హయాంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చినా.. వాటికి కనీస మౌలిక వసతులు కల్పించలేదని సీఎం విమర్శించారు. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలోని తండాలకు బీఆర్‌ఎస్ నాయకులను తీసుకెళ్లి ఆధారాలు చూపించాలని మంత్రికి  సూచించారు. రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదని ఆరోపించారు. అంతకు ముం దు ఆర్టీసీ విలీనంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడటానికి స్పీకర్ అనుమతి ఇవ్వగా.. మాజీ మంత్రి హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నల జాబితాలో సాంబశివరావు పేరు లేకపోయినా అవకాశం ఇచ్చా రని, బీఆర్‌ఎస్ సభ్యుల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.

వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ఏదైనా ఒక ప్రశ్న సభ ఆమోదం పొందితే అది ప్రశ్న అడిగిన సభ్యుడిదే కాదని, సభా ప్రాపర్టీగా మారుతుందని తెలిపారు. 20 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా పని చేశానని చెప్పుకుం టూ జబ్బలు చరుచుకొనే హరీష్‌రావుకు కనీసం ఈ విషయం తెలియదా? అని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినప్పుడు బీఆర్‌ఎస్ నేతలకు సోయి లేదా? అని సీఎం ప్రశ్నించారు. ‘ఆర్టీసీ కార్మిక సంఘాలు దీక్షలు చేసినప్పుడు హరీష్‌రావే యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను  యూనియన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించేం దుకే నాటి సీఎం కార్మిక సంఘాలను రద్దుచేశారు’ అని ఆరోపించారు. ఆర్టీసీని తమ ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని తెలిపారు. ఆర్టీసీని పూర్తిగా ధ్వంసం చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.