- కృష్ణా జలాల వివాదంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం
- ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’పై మొదట విచారణ
- ట్రిబ్యునల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదంలా పరిణమించిన కృష్ణా నదీజలాల వివాదం పరిష్కారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణా నదీ జలాల వివాదంపై విచారిస్తున్న కృష్ణా వాటర్ డిస్‌ప్యూట్స్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్) కీలక నిర్ణయం ప్రకటించింది.
ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’పై మొదటగా విచారణ చేస్తామని తాము తీసుకున్న నిర్ణయాన్ని ట్రిబ్యునల్ ప్రకటించింది. 1956 ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్‌ప్యూట్స్ సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై మొదటగా ఇరు రాష్ట్రాల వాదనలు వింటామని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది.
రాష్ట్ర విభజనకు అదే కారణం..
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ వెనుక.. ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది కూడా నదీజలాల్లో తీవ్ర వివక్షే. కృష్ణా, గోదావరి నదీజలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా నదీజలాల్లో కేవలం 299 టీఎంసీల నీటిని తెలంగాణకు, 512 టీఎంసీల నీటిని ఏపీ పంచుకునేలా ఆ ఒప్పందం జరిగింది.
అయితే ఈ ఒప్పందం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణవాదులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. కృష్ణా బేసిన్‌లో 68.5 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా తెలంగాణలో ఉండగా.. వాస్తవానికి 555 టీఎంసీల నీటిని కేటాయించాలని.. కానీ అందుకు విరుద్ధంగా 299 టీఎంసీలకే అంగీకరిస్తూ.. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన హక్కులను బలిచేశారనే విమర్శలు ఉండనే ఉన్నాయి.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం..
నిజానికి కృష్ణా బేసిన్‌లోని పాలమూరు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలకు నీటి కేటాయింపులు లేవు. వీటికి సంబంధించిన డీపీఆర్‌లను సమర్పించి.. సీడబ్ల్యూసీ నుంచి, కేఆర్‌ఎంబీ నుంచి నీటి కేటాయింపులకు కృషి చేయాల్సిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇందుకు విరుద్ధంగా పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజల ఆశలపై నీళ్లుచల్లేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం జల వనరులను తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు పంచాలని స్పష్టంగా పేర్కొన్నారు.
దీనికి అనుగుణంగానే ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’ను కేడబ్ల్యూడీటీ నివేదించారు. అయితే ఈ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగడం లేదనే విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. 2015లో సుప్రీంకోర్టుకు వెళ్లింది. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. ఇదిలా ఉండగా.. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ (కేంద్ర జల్ శక్తి మంత్రి) మాట్లాడుతూ..
సుప్రీంకోర్టులోని పిటిషన్‌ను ఉపసంహరించాలని సూచించారు. తద్వారా కొత్త ట్రిబ్యు నల్ ఏర్పాటుకు న్యాయ వివరణ కోరుతామని చెప్పారు. దీనిపై అప్పటి సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ఒక్కరోజులోనే పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని ప్రకటిం చారు. కానీ 2021 జూన్ వరకు ఉపసంహరణ పిటిషన్ వేయలేదు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు 2023 అక్టోబర్‌లో ఉపసంహరణకు అనుమతించింది. దీనివల్ల కృష్ణా నదీజలాల కేటాయింపులో తీవ్ర ఆలస్యం జరిగింది.
ట్రిబ్యునల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ఉత్తమ్
పిటిషన్ ఉపసంహరణ కారణంగా.. కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు కొత్త ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’ను ప్రతిపాదించింది. దీనికే ఇప్పుడు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అనుమతించింది. మొదట.. అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫెరెన్స్‌లో పేర్కొన్న అంశాలపైనే విచారణ కొనసాగిస్తామని స్పష్టంగా చెప్పడంతో.. తెలంగాణకు కేటాయించే జల వనరుల విషయంలో కీలక ముందడుగని, దీనిని ప్రభుత్వం స్వాగతిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ప్రకారం..
ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్‌ప్యూట్స్ యాక్ట్(ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ యాక్ట్) కింద ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ద్వారా నీటిని కేటాయించని పక్షంలో సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. నీటి లోటు ఉన్నట్లయితే.. విడుదల కోసం ప్రాజెక్టుల వారీగా ప్రత్యేక ప్రణాళికను నిర్ణయించాల్సి ఉంటుంది.
ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ యాక్ట్-1956 ప్రకారం..
కృష్ణా నదీజలాలను తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలోని కేటాయింపుల ఆధారంగా వాటాను పంచుకోవాల్సి ఉంటుంది. కృష్ణా నదిపై వేసిన రెండు ట్రిబ్యునళ్లు ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలను కేటాయించాయి. ఇందులో నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతంలో 45 టీఎంసీలు గోదావరి బేసిన్ ద్వారా కేటాయించబడ్డాయి. గోదావరి బేసిన్ నుంచి మరో 80 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్‌కు కేటాయించబడ్డాయి. ఈ నీళ్లను కృష్ణా డెల్టాకు కేటాయించాల్సి ఉంటుంది.
అయితే ఏపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా కృష్ణా ట్రిబ్యునల్ సూచించిన చట్టాన్ని అమలు కాకుండా ఏదో ఒక సాకుతో ఆలస్యం చేస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. సెక్షన్ ప్రకారం ట్రిబ్యునల్ విచారించాలని తెలంగాణ వాదించింది. కేంద్రం జారీ చేసిన టీవోఆర్ చెల్లుబాటును సవాల్ చేస్తూ 2023లో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు ఏపీ ట్రిబ్యునల్ ముందు వాదించింది.