calender_icon.png 10 January, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

తీయ్యని వేడుక చేసుకుందాం!

19-08-2024 12:00:00 AM

అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రక్షా బంధన్. ఈ రోజున కచ్చితంగా స్వీటు వండాల్సిందే. చాలామంది స్వీటు కొనేసి పండుగ చేసేస్తారు. కానీ ఇంట్లోనే చక్కగా సింపుల్‌గా చేసే రెసిపీలు ఇవిగో.. ఇరవై నిమిషాల్లో ఈ స్వీట్లు రెడీ అయిపోతాయి.. మరెందుకు ఆలస్యం ఈ రక్షా బంధన్‌కు తీయ్యని వేడుక చేసుకుందాం పదండి..

బాదం హల్వా

కావాల్సిన పదార్థాలుః బాదం పప్పులు-ఒక కప్పు, చక్కెర-అరకప్పు, నెయ్యి-అరకప్పు, నీళ్లు-అయిదు కప్పులు, కుంకుమ పువ్వు-కొద్దిగా. 

తయారీ విధానంః ముందుగా బాదం పప్పును నానబెట్టాలి. నాలుగైదు గంటలు నానబెట్టి తొక్క తీసేయాలి. తర్వాత బాదం పప్పులను ఉడికించాలి. బాగా ఉడికాక తీసి మిక్సీలో వేసి పేస్టు చేసుకోవాలి. అరకప్పు నీళ్లు పోసి బాదం పేస్టులా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టి సగం కప్పు నీళ్లు పోయాలి. చక్కెరను వేసి కరిగిపోయే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇందులో కుంకుమ పువ్వు కూడా వేయాలి. చక్కెర పాకాన్ని పక్కన పెట్టాలి. మరోపాత్రలో నెయ్యి వేసి కాగాక దాంట్లో బాదం మిశ్రమాన్ని వేసి కలపాలి. అయిదు నిమిషాలు ఉడికించాక చక్కెర పాకాన్ని కూడా వేసి కలపాలి. అలా కాస్త గట్టిగా మారేవరకు కలుపుతూ ఉండాలి. చివరిగా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే హల్వా రెడీ. 

బేసన్ లడ్డూ

కావాల్సిన పదార్థాలుః శనగపిండి-మూడు కప్పులు, చక్కెర-మూడు కప్పులు, నెయ్యి-ఒక కప్పు, యాలకుల పొడి-ఒక చెంచా, జీడిపప్పు పది, కిస్‌మిస్‌లు-పది. 

తయారీ విధానంః స్టవ్ మీద పాత్ర పెట్టి నెయ్యి వేయ్యాలి. నెయ్యి కరిగాక అందులో శనగపిండి వేసి కలపాలి. చిన్నమంట పెట్టి వండాలి. లేకుంటే శనగపిండి మాడిపోతుంది. పచ్చి వాసన పోయే వరకు శనగపిండిని నెయ్యిలో వేయించాలి. తర్వాత చక్కెర వేసి కలపాలి. అందులో జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి వేయించాలి. చివరగా యాలకుల పొడి కూడా వేసి కలపాలి. శనగపిండి రంగు మారి కాస్త డార్క్‌గా, ముద్దగా మారాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక ఉండలుగా చుట్టుకోవాలి. అంతే బేసన్ లడ్డూ రెడీ.