calender_icon.png 23 December, 2024 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరటి తోటలు పెంచుదాం

12-10-2024 12:00:00 AM

మంచి ఆరోగ్య అలవాట్లు ఇంటినుంచే మొదలు కావాలి. కఠోర దీక్షతో దేవి శరన్నవరాత్రి దీక్షలు చేస్తున్న ప్రజలు అదే దీక్షతో పెరటి తోటల పెంపకం పట్ల శ్రద్ధ చూపాలి. తద్వార మంచి ఆరోగ్య ఆహార  అలవాట్లకు శ్రీకారం చుట్టిన వాళ్లమవుతాం. ప్లాస్టిక్ వినియోగాన్ని సున్నా స్థాయికి  తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ప్రభుత్వమే ప్రజలకు కాయగూరల విత్తనాలు, పండ్ల మొక్కలు, చెట్లు రాయితీ ధరలకు ఇవ్వాలి.

సీడ్ బాల్స్ తయారు చేయడం, మొక్కలు నాటడం వంటి అలవాట్లతో పిల్లలను ప్రకృతికి దగ్గరగా జీవించడం నేర్పాలి. గ్రీన్ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ లాంటివి సెలెబ్రిటీలతో  నిర్వహిస్తున్న ప్రభుత్వం తోటల విషయంలోనూ తగు శ్రద్ధ కనపరచాలి. కావలసిన ప్రోత్సాహకాలు ఇస్తే ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తారు. శాఖాహారులకు ఈ జీవన శైలి ఎంతగానో ఉపయోగ పడుతుంది.

మన దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున ఒకరికి కేవలం 120 గ్రా. కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. గత మూడేళ్లుగా ధరల స్థిరీకరణ అనేది ఎక్కడా లేదు. వాటి రేట్లు రెండింతలు, మూడింతలవుతున్నా పట్టించుకొనే వారు లేరు. సామాన్య ప్రజలకు కూరగాయలు అందని ద్రాక్షలే అవుతున్నాయి. పెరటి, మిద్దె తోటలతో అనేక మార్పులు తేవచ్చు. గృహిణులు, పిల్లలు వీటి సంరక్షణ గురించి చాల విషయాలు తెలుసుకుంటారు.

ఒకప్పుడు హార్టికల్చర్, అగ్రికల్చర్ శాఖలవారు కూరగాయల విత్తనాలు ఇచ్చేవారు. బెండ, గోరు చిక్కుడు, బీర, కాకర, సొరకాయ, మిరప, టమోట, ఆకుకూరలల్లో పొనుగంటి, పాలకూర, చుక్కకూర, కోయగూర, గోంగూర, శిరి ఆకు, కొత్తిమీర, పుదీన ఎలాంటి వాతావరణంలో అయినా చక్కగా పెరుగుతాయి. ఎకరాల భూమి అవసరం లేదు. కేవలం ఒకటి, రెండు సెంట్ల స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇంట్లోంచి వచ్చే వృధా నీటిని పెంపకానికి వాడుకోవచ్చు. దీనివల్ల నిలువ నీరు, మురుగు నీరు బాధ తప్పుతుంది. తక్కువ స్థలాల్లో ఎక్కువ కూరగాయల చెట్లను పెంచుకోవడం వల్ల చీడ రాదు. ఒకవేళ వచ్చినా సులభంగా తొలగించుకోవచ్చు. రసాయనాల వాడకం ఉండదు. ఈ కిచెన్ గార్డెన్ ఎంత పరిమాణంలో ఉండాలనే దాని గురించిన ఎలాంటి నియమాలు లేవు.

స్థలం చదరంగా ఉండే దానికన్నా దీర్ఘ చతుర స్రాకారంగా ఉంటేనే మంచిది. పంటకోతల ఆధారంగా మూడు సెంట్ల భూమిలో కిచన్ గార్డెన్‌ను ఆరంభిస్తే, కనీసం 4 నుంచి 5 మంది ఉండే కుటుంబానికి సరిపడా కూరకాయలు పండించుకోవచ్చు. అలాగే బంతి, చామంతి, కనకాంబరం, క్రోటన్ పెంచితే ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగానూ ఉంటుంది.    

 డా. ముచ్చుకోట సురేష్‌బాబు