22-03-2025 01:17:04 AM
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): ‘ప్రధాని వద్దకు తీసుకెళ్లండి.. ఢిల్లీకి మీతో వచ్చేందుకు మేం రెడీ’ అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడికైనా తాము వస్తామని, కలిసికట్టుగా ప్రధాని వద్దకు వెళ్లి నిధులు అడుగుదామని బీజేపీఎల్పీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఉద్దే శించి అన్నారు.
ఎనిమిది మంది చొప్పున ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఉన్నారని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను కలిసి తీసుకొద్దామంటే బీజేపీ సభ్యులు పారి పోతు న్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను ఇవ్వకపోగా, తెలంగాణపై కేంద్రం సవితి తల్లి ప్రేమను చూపిస్తోందని విమర్శించారు. కడుతున్న పన్నుల్లో సింహభాగం రాష్ట్రానివే అయినా నిధులు ఇవ్వట్లేదన్నారు.
జాతీయ రహదారులు, రైల్వే లైన్లు ఎవరికోసం ఇస్తున్నారని, అవి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినవేకదా అన్నారు. అది కేంద్రం బాధ్యత అని, అవికాకుండా రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు ఏం ఇచ్చారో చెప్పాలని తమ సభ్యుడు విజయరమణారావు నిలదీస్తుంటే.. బీజేపీ తమపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. తాము ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని, కావాలంటే రాసిపెట్టుకోండని ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
సభా సమయాన్ని వృథా చేస్తున్నారు..
తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని.. కనీసం 10 నిమిషాలు కూడా ఇవ్వలేదని, కానీ ఇప్పుడు హరీశ్‌రావు మాత్రం 2 గంటలు మాట్లాడారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ఏ పార్టీకి సభలో ఎన్ని నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం వస్తుందో కూడా మంత్రి వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీకి 32 నిమిషాలు, బీఆర్‌ఎస్‌కు 19 నిమిషాలు, బీజేపీ, ఎంఐఎంకు చెరో 4 నిమిషాలు, సీపీఐకి 2 నిమిషాలు మాత్రమే వస్తుందని తెలిపారు. హరీశ్‌రావు సందర్భం లేని అంశాలు, గత బడ్జెట్ లెక్కలు చెప్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. బడ్జెట్‌పై ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తానంటూనే ఒక్క సలహా చెప్పి 10 విమర్శలు చేస్తున్నారని.. ఇది సలహాలు ఇచ్చే విధానం కాదన్నారు.