మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు నిర్మించుకున్న ఇళ్ల జోలికి వస్తే ఊరుకోమని, బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం మంగళవారం మూసీ పరివాహక ప్రాంతంలోని గోల్నాక, కృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించింది.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల బతుకులను ఆగం చేస్తుందని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదలకు అండగా ఉండేందుకు ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న భారీ ధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సీ కృష్ణ యాదవ్, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమ్‌రావు, అజయ్‌కుమార్, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.