22-02-2025 12:00:00 AM
గుట్కాలు, పాన్‌పరాగ్‌లతో తీవ్రస్థాయి రోగాలను కొనితెచ్చు కుంటున్నారు అనేకమంది అసంఘటిత కార్మికులు. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక రాసి ఉంటుంది. అయి నా వాటిని ఎవరూ పట్టించుకోరు. గుట్కా, పాన్ మసాలా, ఖైనీ వంటి వాటిని పారిశ్రామికంగా తయారు చేసి, పెద్ద ఎత్తున వాణిజ్యపరంగా మార్కెట్ చేసి, ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న కంపెనీలపట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది.
పొగాకు, అరెకా గింజలు, రసాయనాలు అనేక ఇతర పదార్థాలను పొడి లేదా గ్రాన్యులేటెడ్ రూపంలో కలిగి ఉన్న ఉత్పత్తి గుట్కాలను అల్యూమినియం ఫాయిల్ సాచెట్లలో విక్రయిస్తారు. దీనిని నోటిలో వేసి, తరువాత నమిలి పీల్చడం. తరువాత సాధారణంగా ఉమ్మి వేయడం లేదా కొన్నిసార్లు మింగడం జరుగుతుంది. వాణిజ్య ఉత్పత్తిగా గుట్కా వార్షిక టర్నోవర్ ఏటా పదివేల మిలియన్ అమెరికన్ డాలర్లు. పొగాకు ఉత్పత్తిని నోటిద్వారా వాడటం వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి -నోటి క్యాన్సర్‌తోపాటు గుట్కా మరొక తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. నోటి సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్. దీనివల్ల నోట్లో ఫైబరస్ బ్యాండ్లు అభివృద్ధి చెందుతాయి.
ముఖ్యంగా డ్రైవర్లు, క్లీనర్లు, వర్కర్లు నిద్ర మేల్కొనడానికి, పనిలో నిమగ్నం కావడానికి ప్రతి రోజు కనీసం పదికి తక్కువ కాకుండా గుట్కాలు నములుతుంటారు. అనేక అనర్థాలకు దారి తీస్తున్న పొగాకు ఉత్పత్తులను బ్యాన్ చేయక పోవడం దారుణం. కేవలం ఏడాదిలో వ్యతిరేక ప్రచారం చేస్తున్న నాయకులు, అధికారులు అందరూ కలిసి ఒక్కసారి ఆలోచించాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ భూతంపై ఉక్కుపాదం మోపాలి.
డా. ముచ్చుకోట సురేష్‌బాబు