calender_icon.png 3 March, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్బురపరిచే పెళ్లితంతు!

02-03-2025 12:13:13 AM

పెళ్లి వేడుకలు, కార్యక్రమాలు, సంప్రదాయాలు, పెళ్లితంతు ఇవన్నీ మతాలను, కులాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. అయితే మనదేశంలో లంబాడీల పెళ్లి వేడుక  అన్నింటికంటే కాస్త భిన్నంగా.. అందంగా ఉంటుంది. లంబాడీల పెళ్లితంతులో జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం.. 

లంబాడీలలో వివాహం ఒకే గోత్రం ఉన్నవాళ్లతో జరగదు. వేర్వేరు గోత్రాలవారి మధ్యలో వివాహం జరుగుతుంది. సగాయి అంటే నిశ్చితార్థం. వరుడి తరపు వాళ్లు వధువు తరపు వాళ్లు సగాయి సామాగ్రి బెల్లం, ఎండు కొబ్బరి, ఇప్పసారా, గులాబిరంగు పొడి అనే వాటిని తెస్తారు. అందరూ ఒక మంచి రోజున తమకు అనుకూలమైన ప్రదేశంలో గుండ్రంగా కూర్చుంటారు. వరుడి తండ్రి ఒక రూపాయిని తండా నాయకునికి ఇస్తాడు. రూపాయిని లక్ష్మీదేవిగా భావించి నిశ్చితార్థం జరిపిస్తారు.

తర్వాత అందరికీ బెల్లం తినిపిస్తారు. లక్ష్మీదేవి సాక్షిగా నిశ్చితార్థం జరిగిన తర్వాత హచారాపచారా నిర్వహిస్తారు. హచారాపచారా అనేది ఒక ప్రత్యేకమైన మాటల సమూహం. వియ్యం అందుకునే ముందు రెండు వర్గాల వారికి ఒకరిపై ఒకరికి మంచి అవగాహన కల్పించడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ విధమైన తంతు ఏ జాతిలోనూ కనిపించదు. 

పానకం కార్యక్రమం

ఈ కార్యక్రమాన్ని లంబాడీలు ‘ఘోటా వేడుక’ అంటారు. దీన్ని ఆదివారం రాత్రి జరుపుకుంటారు. తండావాసులు బంధుమిత్రులను ఆహ్వానించి బెల్లం, గసాలు, సొంటి, మిరియాలు, కొబ్బరితో తయారుచేసిన పానకాన్ని పంచుతారు. శ్రీరామనవమికి ఇలాంటి పానకం పంచుతారు. అంటే లంబాడీలు ఇలా పానకాన్ని పంచి సీతారాముల కళ్యాణం లాగా తమ ఇంట్లో కూడా ఎలాంటి వేడుకే జరిగినట్లు భావిస్తారు. 

నలుగు స్నానం

వధువుకు నలుగు స్నానం చేయించే ముందు ఆమె కన్యగా ధరించిన ఆభరణాలను ఒక్కొక్కటిగా తీసివేస్తారు. కన్యగా తాను ధరించిన ఆభరణాలను తీయవద్దని వధువు ప్రాధేయ పడుతూ ఏడుస్తుంది. ముత్తయిదువలు వధువును కాకోటి పాత్ర (రొట్టెల పిండి కలిపే పాత్ర)పై కూర్చోపెట్టి, పసుపు పూసి, కొత్త కుండలలోని చల్లటి నీటితో స్నానం చేయిస్తారు.  

పెళ్లి తంతు

పెళ్లి పందిరిని వధువు ఇంటి ముందు వేస్తారు. తొమ్మిది మూరల పొడవుతో చతురస్రాకారంలో నాలుగు గుంటలు తవ్వుతారు. మధ్యలో రెండు గుంటలు తవ్వుతారు. గుంటల్లో ఐదు పైసల బిళ్లలువేసి, నాలుగు గుంటల్లో గుంజలు పాతి పందిరి వేస్తారు. మధ్యలో రెండు గుంటలలో రెండు రోకళ్లు పాతి పెడతారు. నాలుగు గుంజల దగ్గర దొంతరలతుగా పేర్చిన ఏడు లేదా తొమ్మిది కుండలను పేర్చి జిల్లేడుకొమ్మలతో అలంకరించి తాళ్లతో కట్టి పెడతారు.

చుట్టూ ధాన్యం పోసి మధ్యలో వధూవరులను కూర్చోబెట్టి ఏడు వరుసల దారాన్ని పోలుముంతల చుట్టూ కడతారు. తర్వాత ఈ దారాన్ని తెంపి వధూవరుల చేతులకు కడతారు. ఆ తర్వాత వధూవరులను రోకళ్ళచుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. ఈ ప్రదక్షిణంతో వధూవరులు ఒకటై నట్లు భావిస్తారు. గంజిలో ఉంగరాలు, గవ్వలు, నాణాలు వేసి వధూవరులను బయటకు తీయమంటారు. వివాహానంతరం వధువుకు అత్తింటివారి గాజులు, పాపిట బొట్టు, కాళ్లకు పట్టీలు, మెట్టెలు కాలివేళ్లకు రింగులు ధరింప చేయిస్తారు.